water deficit
-
ముంచుకొస్తున్న ముప్పు..!
కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. నీటికరువు వెంటాడుతోంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. పశువులు, పక్షులు సైతం నీరు లేక అల్లాడుతున్నాయి. తాగడానికి సైతం నీరు దొరకకపోవడం గమనార్హం. పరిస్థితి ఇప్పుడే ఇలాగుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరువు రక్కసిని తలుచుకుని కకావికలం అవుతున్నారు. చెన్నూర్‌రూరల్ : గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రంగానే వచ్చింది.వేసవి కాలం ప్రారంభం కాక ముందే గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండి పోయి దర్శనమిస్తున్నాయి.దీంతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో చెరువులు, కుంటల్లో నీరు లేక బోసి పోతున్నాయి. పశువులకు తాగేందుకు కరువే.. మండలంలోని కత్తెరసాల, చింతలపల్లి, సుద్దాల, కిష్టంపేట, బావురావుపేట, కమ్మరిపల్లి, కాచన్‌పల్లి, కొమ్మెర, పొక్కూరు, ఆస్నాద తదితర గ్రామాల సమీపాల్లోని చెరువుల్లో, నదుల్లో గతంలో ఏడాదంతా పుష్కలంగా నీరుండి మూగజీవాలకు నీరు కరువు ఉండేది కాదు. పగలంతా మేత మేసి సాయంకాలం పశువులు చెరువుల్లో దాహార్తి తీర్చుకునేవి. కానీ గత ఖరీఫ్‌లో వర్షాలు కురవక పోవడంతో వేసవికి ముందే చెరువులు, వాగులు, కుంటలు, నదుల్లో చుక్క నీరు లేకుండా ఇంకి పోయి, అలాగే భూగర్భజలాలు అడుగంటి చివరకు బావుల్లో సైతం చుక్క నీరు లేకుండా కావడంతో పశువులు, కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి బొట్టును వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చుక్క నీరు లేక నదులు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు కళ తప్పి వెల వెల బోతూ దర్శనమిస్తున్నాయి. పశువులకు తాగేందుకు నీరు సక్రమంగా దొరకడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు ఎండి పోయి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు, కాపర్లు పశువులకు, జీవాలకు తాగునీరందించేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. బోరుబావుల దగ్గరికి వెళ్లి పశువులకు తాగునీటిని పెట్టాల్సి వస్తుందని, చెరువుల్లో ఎక్కడో గుంతల్లో ఉన్న నీటిని తాగుతున్నాయని రైతులు, కాపర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన నీటితొట్లు శిథిలావస్థకు చేరుకోగా, మరి కొన్ని నీరు లేక నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకొని శిథిలావస్థకు చేరుకున్న నీటితొట్లకు మరమ్మతులు చేయించి, నీటితొట్లలోకి నీరు వచ్చే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
సాగర్‌కు ఇక తుపాన్లే దిక్కు
నైరుతి ముగియడంతో ఎగువ నుంచి నీటి రాక ఆశలు గల్లంతు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల అనంతరం విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టున్నీ జలకళను సంతరించుకుంటే నాగార్జునసాగర్ మాత్రం నీటి లోటుతో అల్లల్లాడుతోంది. ఏకంగా 121.2 టీఎంసీల లోటును ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాల కాలపరిమితి ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలూ అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో నవంబర్‌లో వచ్చే తుపాన్లనే నమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, అవి వస్తేనే ప్రాజెక్టుల్లోకి ఆశించిన నీరు వస్తుందని, లేదంటే మున్ముందు నీటి కష్టాలు తప్పవని నీటిపారుదల వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌కు ఇప్పటివరకు 420 టీఎంసీల వరకు వరద జలాలు వచ్చా రుు. కానీ దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు మాత్రం కేవలం 102 టీఎంసీలు మాత్రమే వరద చేరింది. దీంతో ప్రస్తుతం సాగర్‌లో 312.04 టీఎంసీల నీటి నిల్వకుగాను కేవలం 190.84 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. 121.1 టీఎంసీల లోటు ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగానే నీరు చేరినా ఆ నీటిని ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులు వాడేసుకోవడంతో సాగర్‌కు పెద్దగా ప్రవాహాలు రాలేదు. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలోనూ 215.80 టీఎంసీల నీటి నిల్వకుగాను 189.45 టీఎంసీ నిల్వ మాత్రమే ఉంది. దీంతో మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 147.55 టీఎంసీల లోటు కనబడుతోంది. గడ్డు పరిస్థితి ఎదురైన గత ఏడాదిలోనూ తుంగభద్ర నుంచి రాష్ట్ర ప్రాజెక్టులకు 73 టీఎంసీల మేర నీరు వచ్చి సాగర్‌ను ఆదుకుంది. కానీ ఈ ఏడాది తుంగభద్రలోకి నీళ్లే రాలేదు. దీంతో ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 100 టీఎంసీల నిల్వకు గానూ కేవలం 30.37 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. ఇక్కడి లోటు ప్రభావం సాగర్ జలాశయంపై పడింది. ఈ నేపథ్యంలో నవంబర్ మొదట్లో బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లనే రాష్ట్రం నమ్ముకోవాల్సి ఉంటుంది. వీటి ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై అధికంగా ఉంటుంది. గతంలో తుఫాన్ల సమయంలో వచ్చిన నీటితోనే సాగర్ జలాశయంలోకి నీరు చేరి జంటనగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు.