కిష్టంపేటలో చుక్క నీరు లేకుండా మారిన కుంట
కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. నీటికరువు వెంటాడుతోంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. పశువులు, పక్షులు సైతం నీరు లేక అల్లాడుతున్నాయి. తాగడానికి సైతం నీరు దొరకకపోవడం గమనార్హం. పరిస్థితి ఇప్పుడే ఇలాగుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరువు రక్కసిని తలుచుకుని కకావికలం అవుతున్నారు.
చెన్నూర్‌రూరల్ : గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రంగానే వచ్చింది.వేసవి కాలం ప్రారంభం కాక ముందే గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండి పోయి దర్శనమిస్తున్నాయి.దీంతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో చెరువులు, కుంటల్లో నీరు లేక బోసి పోతున్నాయి.
పశువులకు తాగేందుకు కరువే..
మండలంలోని కత్తెరసాల, చింతలపల్లి, సుద్దాల, కిష్టంపేట, బావురావుపేట, కమ్మరిపల్లి, కాచన్‌పల్లి, కొమ్మెర, పొక్కూరు, ఆస్నాద తదితర గ్రామాల సమీపాల్లోని చెరువుల్లో, నదుల్లో గతంలో ఏడాదంతా పుష్కలంగా నీరుండి మూగజీవాలకు నీరు కరువు ఉండేది కాదు. పగలంతా మేత మేసి సాయంకాలం పశువులు చెరువుల్లో దాహార్తి తీర్చుకునేవి. కానీ గత ఖరీఫ్‌లో వర్షాలు కురవక పోవడంతో వేసవికి ముందే చెరువులు, వాగులు, కుంటలు, నదుల్లో చుక్క నీరు లేకుండా ఇంకి పోయి, అలాగే భూగర్భజలాలు అడుగంటి చివరకు బావుల్లో సైతం చుక్క నీరు లేకుండా కావడంతో పశువులు, కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి బొట్టును వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చుక్క నీరు లేక నదులు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు కళ తప్పి వెల వెల బోతూ దర్శనమిస్తున్నాయి. పశువులకు తాగేందుకు నీరు సక్రమంగా దొరకడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు ఎండి పోయి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు, కాపర్లు పశువులకు, జీవాలకు తాగునీరందించేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. బోరుబావుల దగ్గరికి వెళ్లి పశువులకు తాగునీటిని పెట్టాల్సి వస్తుందని, చెరువుల్లో ఎక్కడో గుంతల్లో ఉన్న నీటిని తాగుతున్నాయని రైతులు, కాపర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన నీటితొట్లు శిథిలావస్థకు చేరుకోగా, మరి కొన్ని నీరు లేక నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకొని శిథిలావస్థకు చేరుకున్న నీటితొట్లకు మరమ్మతులు చేయించి, నీటితొట్లలోకి నీరు వచ్చే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment