సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరంతా తమవేనని తెలంగాణ రాష్ట్రం కృష్ణాబోర్డుకు స్పష్టం చేసింది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లినందున, సాగర్‌లో కనీస మట్టాలకు ఎగువన ఉన్న 31.6 టీఎంసీల నీటి వాటా కింద తమకు దక్కేవని తెలిపింది. ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి ఎలాంటి వాటా ఉండదని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. గతంలో బోర్డు చేసిన కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగాన్ని దాని దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు ఏపీకి 33.40 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే ఆ రాష్ట్రం 33.39 టీఎంసీల నీటిని వినియోగించిందని వెల్లడించారు.
తెలంగాణకు 46.90 టీఎంసీల మేర కేటాయింపులు చేయగా, ఇందులో 31.71 టీఎంసీల మేర వినియోగించగా, మరో 15.19 టీఎంసీల మేర వాడుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఎలాంటి నీటి లభ్యత లేకపోగా, సాగర్‌లో మాత్రం 31.64 టీఎంసీల మేర ఉందని తెలిపారు. ఇందులో తెలంగాణ వినియోగించుకోవాల్సిన నీటి వాటాతో పాటు 13 టీఎంసీలను తెలంగాణ అవసరాలకు రిజర్వ్‌లో ఉంచారని, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 28.19 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని లెక్కల ద్వారా తెలిపా రు. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటి వరకు 577.99 టీఎంసీలకుగాను ఆంధ్రప్రదేశ్ 401.218 టీఎంసీలు (69.42 శాతం), తెలంగాణ 176.778 టీఎంసీలు (30.58 శాతం) వినియోగించుకుందని, రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ దామాషా ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతంగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కల దృష్ట్యా సాగర్‌లో లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతుందని పేర్కొంది.
శ్రీశైలంలో తగ్గుతున్న నిల్వ
శ్రీశైలంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ 885 అడుగుల మట్టానికి గానూ ప్రస్తుతం 828.20 అడుగుల మట్టంలో 47.68 టీఎంసీల నిల్వలున్నాయి. నిజానికి శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా ఇప్పటికే దానికి దిగువన 5 టీఎంసీల మేర ఇరు రాష్ట్రాలు నీటి వినియోగం చేసేశాయి. మంగళవారం సైతం శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా ఏపీ 960 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా తెలంగాణ 2.400 క్యూసెక్కుల నీటిని తరలించుకున్నాయి. శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా ఇప్పటివరకు కృష్ణా బోర్డు భేటీపై స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment