సాక్షి, హైదరాబాద్/గద్వాల: ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జల సవ్వడి మొదలైంది. ఎగువ కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ నిండటంతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. నారాయణపూర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో జూరాలకు 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. శ్రీశైలానికీ ప్రవాహాలు క్రమం గా పెరుగుతున్నాయి. ఎగువ నుంచి వరద మరిం త పెరగనుండటంతో శుక్రవారం ఉదయానికి ప్రవాహాలు జోరందుకోనున్నాయి. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్‌లను వరద ముంచెత్తుతోంది.
ఆల్మట్టిలోకి గురువారం ఉదయం 1.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. రాత్రికి మరిం త పెరిగి ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 1.53 లక్షల క్యూసెక్కుల దాకా దిగువకు వదులుతున్నారు. దాంతో జూరాలకు గురువారం ఉదయం 27వేల క్యూసెక్కులున్న వరద సాయంత్రానికి 90 వేల క్యూసెక్కులకు, రాత్రికల్లా 1.2 లక్షలకు పెరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ కూడా 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.84 టీఎంసీలకు చేరుకుంది. దాంతో మొత్తంగా లక్ష క్యూసెక్కులను దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు.
తుంగభద్ర జలాశయం సైతం నిండటంతో 68 వేల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేశారు. దీంతో నేడో రేపో శ్రీశైలానికి భారీగా వరద చేరుకునే అవకాశం ఉంది.శ్రీశైలం డ్యామ్‌లో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29.13 టీఎంసీల నిల్వలున్నాయి. గురువారం ఎగువ జూరాల జల విద్యుత్క్రేందంలో 6 యూనిట్లు ప్రారంభించి 240 మెగావాట్లు, లోయర్ జూరాలలో 4 యూనిట్లు ప్రారంభించి 160 మెగావాట్లు ఉత్పత్తి చేశారు.
జూరాలకు భారీ వరద వస్తుండటంతో ప్రభుత్వం ఆదేశం మేరకు దాని పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకూ 73,898 క్యూసెక్కుల వరద వస్తోంది. 68,643 క్యూసె క్కులు దిగువకు వదులుతున్నారు. దాంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment