హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా! | Right to 90 TMC Additional share! | Sakshi
Sakshi News home page

హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా!

Published Mon, Aug 15 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా!

హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా!

సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో అదనంగా వచ్చే నీటి వాటాలను సాధించుకునేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో అదనపు నీటి వాటాలు కోరేలా వాదనలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రావాల్సిన 90 టీఎంసీల నీటి వాటాను లేవనెత్తనుంది. కృష్ణా బేసిన్ పరిధిలో పర్యటించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు కృష్ణా జల వివాదాలపై ట్రిబ్యునల్ ముందు చేపట్టాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది.

ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో కర్ణాటకకు 22 టీఎంసీలు, మహారాష్ట్రకు 13 టీఎంసీలతోపాటు తమకు 45 టీఎంసీలు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా మరేదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది.

ఈ లెక్కన 45 టీఎంసీలతో ఏపీ పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తమకు దక్కాలని వాదిస్తోంది. అంటే మొత్తంగా 90 టీఎంసీల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరుతూ వాటాలకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీకి కృష్ణాలో 512 టీఎంసీల వాటా ఉన్నా కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు 550 టీఎంసీల మేర నీటిని మళ్లిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి వాటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఎ), సెక్షన్ (బి)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని, ఇది తేలాలంటే నాలుగు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరపాలని రాష్ట్రం కోరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement