రెండ్రోజుల్లో రాష్ట్రానికి ‘కృష్ణా’..
- ఆల్మట్టి, నారాయణపూర్‌కు జలకళ
సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరీవాహకంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి మరో 30 టీఎంసీలు చేరితే ఒకట్రెండు రోజుల్లో దిగువకు కృష్ణా పరవళ్లు మొదలుకున్నాయి. గతేడాది కర్ణాటక నుంచి తెలంగాణకు ఆగస్టు రెండో వారం తర్వాత ఇన్‌ఫ్లోలు మొదలుకాగా ఈ ఏడాది ఈ నెలాఖరుకే మొదలయ్యే అవకాశాలు ఉండటం రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశమని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో ఉండటం సైతం రాష్ట్రానికి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో పది రోజుల వ్యవధిలోనే రెండు జలాశయాల్లోకి 90 టీఎంసీల నీరు చేరింది. ఆదివారం ఆల్మట్టిలోకి 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగాయి. నీటిని విడుదల చేస్తుండటంతో అటు నారాయణపూర్ కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టు సైతం రెండ్రోజుల్లో నిండనుంది. నారాయణపూర్‌లో ఆశించిన నీరు చేరిన వెంటనే దిగువ జూరాలకు కర్ణాటక నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎగువ ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరడం, ఒకట్రెండు రోజుల్లో దిగువకు నీరొచ్చే అవకాశాలుండ టం రాష్ట్ర రైతాంగంలో ఆశలు రేపుతోంది.
కృష్ణా బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల్లో నీటిమట్టాల వివరాలు
ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో
కృష్ణా బేసిన్ (టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో)
ఆల్మట్టి 129.7 112.59 1,88,632
తుంగభద్ర 100.86 37.47 10,204
నారాయణపూర్ 37.646 24.34 1,11,784
జూరాల 11.94 3.58 0
శ్రీశైలం 215.8 23.72 40
నాగార్జునసాగర్ 312.04 121.5 400