
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునే అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మెత్తబడింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులు బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై వెనక్కి తగ్గింది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబట్టిన నేపథ్యంలో వాటిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచేలా తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. దానిపై అభిప్రాయాలు కోరుతూ శుక్రవారం తెలంగాణ, ఏపీకి లేఖలు రాసింది.
రాష్ట్రానికి ఉపశమనం...
కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమంటూ ఏపీ కేంద్రానికి లేఖలు సైతం రాసింది. ఇందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో కృష్ణా బోర్డు... శ్రీశైలం, సాగర్‌తోపాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీలను తమ పరిధిలోకి తెచ్చుకుంటామంటూ గతంలో డ్రాఫ్ట్ వర్కింగ్ మాన్యువల్ రూపొందించి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అయితే బోర్డు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజెక్టులవారీగా నీటి లెక్కలు తేలాక... బోర్డు వాటి నిర్వహణనే చూడాలని తేల్చిచెప్పింది. దీంతో తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న బోర్డు... ప్రాజెక్టులపై ప్రత్యక్షంగా తమ నియంత్రణ ఉండదంటూ తుది వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసింది. ప్రాజెక్టులన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతి తప్పనిసరి
కృష్ణా బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్‌తోపాటు తమ అనుమతి తప్పనిసరని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా ధిక్కరణలకు పాల్పడితే కేంద్రం విధించే ఆర్థిక, ఇతర జరిమానాలు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చని సూచించింది. బోర్డు పరిధిలో పరిష్కారమవని ఏ అంశంపైనైనా ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరణ ఇచ్చింది. వర్కింగ్ మాన్యువల్‌కు ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.