25న శ్రీశైలం నీటి విడుదల!
24న జరిగే వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదలకు సమయం దాదాపు ఖరారైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల అవసరాల మేరకు తొలి విడతగా ఈ నెల 25న శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై 24న జరిగే కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వర్షాభావం కారణంగా కృష్ణా బేసిన్ పరిధిలోని శ్రీశైలం, సాగర్‌లో నిల్వలు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం కనీసస్థాయి కంటే దిగువన 509.8 అడుగులకు పడిపోయింది. గత ఏడాది ఆగస్టు 20న 537.8 అడుగుల మట్టం వద్ద సుమారు 183.77టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇక శ్రీశైలంలో నీటిమట్టం ప్రస్తుతం 802 అడుగులకు పడిపోయింది. ఇక్కడ గత ఏడాది ఇదే రోజున 173.47 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండగా... ప్రస్తుతం ఉన్న నీళ్లు 30.27 టీఎంసీలే.
శ్రీశైలంలో 785 అడుగుల మట్టం వరకు నీటిని వాడుకోవచ్చు. ఈ లెక్కన ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 8 టీఎంసీల వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు తాగు అవసరాల కోసం చెరో 3టీఎంసీల మేర నీటిని విడుదల చేయాలంటూ బోర్డుకు లేఖలు రాశాయి. దీనిపై బోర్డు ఓ నిర్ణయం తీసుకుంటే నీటి విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 24న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖలు పంపింది.