
కనీస నీటిమట్టం సాధ్యం కాదు
కృష్ణా బేసిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం వరకు నీటి నిల్వ సాధ్యం కాదని కృష్ణాబోర్డు తెలంగాణకు తేల్చిచెప్పింది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం వరకు నీటి నిల్వ సాధ్యం కాదని కృష్ణాబోర్డు తెలంగాణకు తేల్చిచెప్పింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటికే కనీస నీటిమట్టాలకు దిగువన లభ్యతగా ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు పంచేసిన దృష్ట్యా ఎండీడీఎల్ సాధ్యం కాదని పేర్కొంది. సాగర్‌లో నీటిమట్టం 511.40 అడుగులకు చేరిందని, కనీస నీటిమట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగించే పంపులు పనిచేయలేవని 4 రోజుల క్రితం బోర్డుకు రాష్ట్ర అధికారులు తెలిపారు.
దీనికి స్పందిస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణకు గురువారం లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాల(ఎండీడీఎల్)కు ఎగువన, దిగువన ఉన్న నీటిని పంచు తూ గత నెల 8న చేసిన నిర్ణయాలను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. శ్రీశైలంలో 834 అడుగులు, సాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టాలకు ఎగువన 34 టీఎంసీ లు, దిగువన మరో 44 టీఎంసీల నీటి లభ్యతగా ఉందని, ఆ మొత్తం నీటిలో 47 టీఎంసీలు ఏపీకి, 31 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏపీ 25.20 టీఎంసీలు వినియోగించగా మరో 21.79 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని, తెలంగాణ 19.62 టీఎంసీలు వాడుకోగా, మరో 11.37 టీఎంసీ వినియోగించుకోవచ్చన్నారు. సాగర్‌లో వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నీటిని కేటాయించామని, కేటాయింపులు జరిగాక సాగర్‌లో వచ్చే నెల 15 వరకు 510 అడుగులు ఉండేలా చూడటం సాధ్యం కాదని తెలిపింది.