వైఎస్సార్సీపీ జలయుద్ధం
ఈనెల 7న సీమ జిల్లాల రైతులతో కలిసి శ్రీశైలం డ్యాం ముట్టడి
నంద్యాల/శ్రీశైలం: సీమ జిల్లాల దాహార్తిని విస్మరించి పొరుగు ప్రాంతాలకు అంతర్గతంగా జల సాయం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ యుద్ధం ప్రకటిచింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగు, విద్యుత్, అవసరాలను చూపి నీటిని తీసుకెళ్లడానికి అభ్యంతరం తెలుపుతోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఈనెల 7న శ్రీశైలం రిజర్వాయర్‌ను ముట్టడించడానికి నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ముహూర్థం నిర్ణయించారు.
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 2కోట్ల మంది ప్రజలకు తాగునీటిని అందించడంలో కృష్ణా జలాలతో నింపుకున్న శ్రీశైలం రిజర్వాయర్ కీలక భూమిక పోషిస్తోది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కర్నూలు, కడప జిల్లాల్లో కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులతో పాటు హెచ్‌ఎల్‌సీ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలకు తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి చిత్తూరు జిల్లాకు సాగునీటిని దాదాపు 10లక్షల ఎకరాలకు పైగా అందిస్తోంది. ఈ పొలాలకు సాగునీరు అందాలన్నా, దాహార్తి తీరాలన్నా శ్రీశైలం రిజర్వాయర్‌లో 854అడుగుల కనీస నీటి మట్టాన్ని కొనసాగిస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి. అయితే తెలంగాణాలోని నల్గొండ, సీమాంధ్రలోని కోస్తా జిల్లాలకు శ్రీశైలం నుంచి 788అడుగుల్లోపే నీటిని తరలించడానికి అవకాశం ఉంది.
దీంతో రాయలసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సీమ జిల్లాల అత్యవసరాలను విస్మరించి ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి బాసటగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ సీమ నాయకులు ముందుకు నడుంబిగించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి శ్రీశైలం జలాశయంతో లబ్ధి పొందే ప్రాంతాల ఎమ్మెల్యేలను కలుపుకొని ఈనెల 7న శ్రీశైలం రిజర్వాయర్ ముట్టడికి సిద్ధపడ్డారు.
854అడుగులకు తాము పోరాటం చేస్తుంటే కృష్ణా నీటి యాజమాన్య కమిటీ 788అడుగులకు తగ్గిస్తే అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడంపై కూడా భూమా మండిపడుతున్నారు. గతంలో జలపోరాటం చేసిన ఎంపీ ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నా ఆయన కూడా ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడటంపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీమకు జరుగుతున్న అన్యాయంపై గతంలో గళమెత్తారు. ఇప్పుడు పదవి వచ్చిందని నోరు మెదపకపోవడంపై కూడా సీమ జిల్లాలకు చెందిన రైతులు ఆగ్రహంతో ఉన్నారు.