
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్, కర్నూలు, అనంతపురంలలో సౌర విద్యుత్ ఉత్పత్తి లాభసాటని ఉత్పత్తిదారులు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంధన ఎగుమతి విధానం’ (ఎక్స్‌పోర్ట్ పాలసీ) వారిని మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తోపాటు పలు దేశీయ, విదేశీ కంపెనీలు సీమ జిల్లాలపై దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పై మూడు జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరిగే వీలుంది. ఇటీవల అధ్యయనాలను బట్టి ఆ జిల్లాల్లో సోలార్ రేడియేషన్ ఉదయం త్వరగా వస్తుందని, సాయంత్రం పొద్దుపోయే వరకూ ఉంటోందని తేలింది. ట్రాకింగ్ (సూర్యుడు ఎటువైపు తిరిగితే అటు ప్యానల్ తిరిగేలా) సిస్టమ్ అమర్చుకుంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం..
రాయలసీమ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నవి కొన్నే. ఇప్పుడు ట్రాకింగ్‌తోపాటు తేలికగా రేడియేషన్‌ను తెచ్చే మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వాట్స్ (దాదాపు 350 వాట్స్) ఉండే ప్యానల్స్ ఉన్నాయి. తక్కువ ప్రదేశంలోనే వీటిని ఎక్కువగా అమర్చుకోవచ్చు. తద్వారా గతంలో కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. సాధారణంగా ఒక మెగావాట్‌కు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తే కేవలం 4 ఎకరాల భూమితో సరిపెట్టే వీలుందని అధికారులు అంటున్నారు. పైగా ప్రస్తుతం వస్తున్న 22 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను 25కు తీసుకెళ్లే వీలుందని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూముల వివరాలు..
ఎక్స్‌పోర్ట్ పాలసీతో అపార అవకాశాలు..
► ఎక్స్‌పోర్ట్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల కోసం దాదాపు లక్ష ఎకరాలను గుర్తించింది. ఇందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది.
► రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఆయా సంస్థలు మరే ఇతర రాష్ట్రాల్లోనైనా అమ్ముకోవచ్చు. దీన్నే ఎక్స్‌పోర్ట్ పాలసీ అంటారు. విద్యుత్‌ను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) లైన్లు వాడుకునే ఏర్పాట్లు చేస్తోంది.
► రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 25 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వనుంది. ప్రతి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment