అన్నదాతకు నాణ్యమైన విద్యుత్ | Quality electricity to farmers in AP | Sakshi
Sakshi News home page

అన్నదాతకు నాణ్యమైన విద్యుత్

Published Thu, Dec 31 2020 5:23 AM | Last Updated on Thu, Dec 31 2020 5:23 AM

Quality electricity to farmers in AP - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ వ్యవసాయ ఉచిత విద్యుత్‌ పథకాన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న మెగా సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణ టెండర్ల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. అత్యంత పారదర్శకంగా చేపట్టిన యీ ప్రక్రియ ఫిబ్రవరి నాటికి ముగియనుంది. 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నవంబర్‌ 30న గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ టెండర్లు ఆహ్వానించింది. తుది గడువు ముగిసిన డిసెంబర్‌ 28 నాటికి ఐదు సంస్థలు 24 బిడ్లు దాఖలు చేశాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఏ విధమైన అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా టెండర్‌ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపారు. మరోవైపు ప్రజల నుంచి అందిన 150 సలహాలు, సూచనలనూ పరిగణనలోనికి తీసుకున్నారు. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారమే టెండర్‌ నిబంధనలు పొందుపర్చారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మరింత చౌకగా టెండర్‌ ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.   

ఢోకాలేని విద్యుత్‌ సరఫరా దిశగా సర్కారు అడుగులు 
రైతన్నకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే ఫీడర్లను బలోపేతం చేశారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్‌ వాడకం క్రమంగా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. ఏటా 12,221 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. దీంతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువవుతోంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ అరకొరగానే ఉండేది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉంటే,  2018–19 నాటికి రూ.4 వేల కోట్లకు చేరింది. అయితే కేటాయించిన సబ్సిడీని కూడా గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్‌లు అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీని రూ.8,354 కోట్లకు పెంచడమే కాదు... పాత బకాయిలూ చెల్లించి డిస్కమ్‌లను ఆదుకుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు ఏడాదికి 50 వేలు చొప్పున పెరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్‌కు తగిన సరఫరా చేయాలంటే సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటే ఏకైక మార్గమని భావించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగులేసింది.  

ప్రభుత్వ పెట్టుబడి లేకుండా .. తక్కువ ధరకే సౌర విద్యుత్‌ 
ఈ ప్లాంట్ల ఏర్పాటును రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ సోలార్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా చేపట్టే ఈ ప్రాజెక్టు 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కో సొంతమవుతుంది. ప్లాంట్‌ నిర్మాణం చేపట్టే సంస్థలతో డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రస్తుతం యూనిట్‌ రూ.4.68 చొప్పున సౌర విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ ఒప్పందాల వల్ల ఈ ధర చెల్లించడం అనివార్యమవుతోంది. నిజానికి ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో సోలార్‌ విద్యుత్‌ ధరలు కనిష్టంగా యూనిట్‌ రూ.1.99, గరిష్టంగా రూ. 2.43 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మెగా సోలార్‌ ప్రాజెక్టు నుంచి తీసుకునే విద్యుత్‌ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రస్తుత ధరలతో పోలిస్తే 30 ఏళ్లలో రూ.48,800 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని పేర్కొంటున్నాయి. భవిష్యత్‌లో ప్రభుత్వంపై ఉచిత విద్యుత్‌ సబ్సిడీ భారమూ తగ్గుతుందని చెబుతున్నాయి. 

ప్రభుత్వ, బీడు భూముల్లో ప్లాంట్లు 
అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఉన్న బంజరు భూములు సోలార్‌ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలమైనవిగా గుర్తించారు. అందులోనూ  50 శాతం ప్రభుత్వ భూములే ఉండటం మరింత కలిసొచ్చే అంశం.  మిగిలిన 50 శాతం పంటలు పండని ప్రైవేట్, అసైన్డ్‌ భూములను సేకరించారు. వీటికి ఏడాదికి ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు చెల్లిస్తారు. సాగులేని భూములను వినియోగంలోకి తేవడం, 30 ఏళ్ల పాటు ప్రైవేట్‌ భూములకు ఆదాయం చెల్లించడం ద్వారా ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. సోలార్‌ విద్యుత్‌ వల్ల థర్మల్‌ విద్యుత్‌ వాడకం తగి, 14 మిలియన్‌ టన్నుల మేర కార్బన్‌ డై ఆక్సైడ్‌ గాలిలో కలిసే అవకాశం ఉండదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటికే 10 సోలార్‌ పార్కులకు ఏర్పాట్లు జరిగాయి. వైఎస్సార్, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే ఇవి ఏర్పాటు కానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement