గతంలో వ్యవసాయ కరెంట్ ఎప్పుడొస్తుందో తమకే తెలియదన్న అధికారులు ఇప్పుడు కచ్చితమైన సమాచారం ఇస్తున్నారని అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండకి చెందిన చిన్న రంగన్న ఆనందంగా చెప్పాడు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఏటా నీళ్లు లేక ఎండిపోయే ఆయన మామిడి తోట ఈసారి విరగ కాసింది.
కర్నూలు జిల్లా చేబోలుకు చెందిన రైతు బంగారు రెడ్డి గతంలో లో వోల్టేజీతో తరచూ మోటార్లు కాలిపోయి కరెంటోళ్ల చుట్టూ తిరిగి విసిగిపోయేవాడు. ట్రాన్స్‌ఫార్మర్ మార్చేసరికి పంట సీజన్ పూర్తై నష్టం జరిగేది. ఇప్పుడు పగలే 9 గంటలు నాణ్యమైన కరెంట్‌తో సమస్యలు తీరాయి.
కరెంట్ 9 గంటలు పగలే ఇస్తామని తమ ఊళ్లోకొచ్చి మరీ అధికారులు చెప్పారని, ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వస్తామన్నారని తుని ప్రాంతానికి చెందిన రైతు వీరేశ్వర్ తెలిపారు. అయితే ఆయనకు ఇంతవరకు ఆ అవసరమే రాలేదు. గతంలో రోజూ ట్రిప్ అయ్యేదని, ఇప్పుడు ఒక్కసారి కూడా సమస్య తలెత్తలేదు.
సాక్షి, అమరావతి: ఐదేళ్ల క్రితం నాటి మాట.. భూమిలో కావాల్సినన్ని నీళ్లు, పొలంలో మోటర్ ఉన్నా కరెంట్ మాత్రం ఉండేది కాదు. రోజుకు ఏడు గంటల మాట దేవుడెరుగు అసలు ఎప్పుడొస్తుందో తెలియక పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడా దురవస్థ లేదు. ఏ పల్లెకెళ్లినా రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతోంది. వరుణుడు దోబూచులాడినా 9 గంటలు పగటిపూట విద్యుత్‌పై భరోసాతో అన్నదాతలు ధైర్యంగా పొలం పనులు ప్రారంభిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియని చీకటి రోజులకు ప్రభుత్వం చరమగీతం పాడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చడంతో వ్యవసాయదారుల్లో నమ్మకం పెరిగింది. వారి మాటల్లోనే అది స్పష్టమవుతోంది.
రూ.1,700 కోట్లతో ఫీడర్లు బలోపేతం..
వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని నవరత్నాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చీ రావడంతోనే దీనిపై సమీక్షించింది. ఆనాటికి రాష్ట్రంలో విస్తుబోయే పరిస్థితి ఉంది.
- గత సర్కారు హయాంలో వ్యవసాయానికి వేళాపాళా లేకుండా 7 గంటలే విద్యుత్తు ఇవ్వడంతో పంట పొలాలు ఎండిపోవడం, తరచూ మోటార్లు కాలిపోవడం, రైతులు విష పురుగుల కాటుకు బలి కావడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
- వంద శాతం ఫీడర్లను బలోపేతం చేయాలంటే భారీగా వ్యయం చేయాలి. గత సర్కార్ ఉన్నకాడికి అప్పులు చేయడంతో కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగుదారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఫీడర్ల బలోపేతాన్ని చేపట్టారు. ఖరీఫ్ సీజన్‌లో సమర్థత ఉన్న ఫీడర్లలో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రబీ నాటికి వంద శాతం ఫీడర్లు సరఫరాకు సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 32 ప్రాజెక్టులు చేపట్టగా ఇవన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
ఏడాదిలో 65 వేల కొత్త కనెక్షన్లు జారీ...
- రైతుల పొలానికి కరెంట్ ఉచితంగా రావాలంటే ఆ భారాన్ని ప్రభుత్వమే మోయాలి. లేదంటే డిస్కమ్‌లు దివాలా తీస్తాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గతంలో అదే జరిగింది. టీడీపీ హయాంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పూర్తిగా చెల్లించలేదు.
- పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలో చాలా వరకూ ఈ ప్రభుత్వం తీర్చేసింది. పైగా వ్యవసాయ సబ్సిడీ కింద ఈ ఏడాది రూ. 8,255 కోట్లు కేటాయించింది. డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కేలా రుణాలు ఇప్పించింది.
- సాగును పండుగ చేయాలన్న సంకల్పంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 65 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చి రికార్డు సృష్టించింది.
- ఉచిత విద్యుత్‌ను రైతన్నకు శాశ్వత వరంగా నిలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశయం. ఇందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపింది. ఇది అమలులోకి రాగానే రైతన్న ఇక ఏనాడూ బోరుబావి దగ్గర కంటతడి పెట్టే పరిస్థితి ఉత్పన్నం కాదు.
►వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 60 శాతం ఫీడర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతుండగా అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఫీడర్ల సామర్థ్యాన్ని 83 శాతానికి పెంచి పగలే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందచేస్తోంది.
► రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్లుండగా 5,547 ఫీడర్లు (83 శాతం) 9 గంటల ఉచిత విద్యుత్ అందించే సమర్థత కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోమిగతా 17 శాతం ఫీడర్లను కూడా అదనపు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా బలోపేతం చేసి మొత్తం 100 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలు విద్యుత్తును రబీ నాటికి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ...
పగటి పూటే 9 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేయాలనిపిస్తోంది. – భాస్కర్‌రెడ్డి, గూబనపల్లి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా
పాముకాటుతో ప్రాణాలు విడిచారు..
ఆ బాధలు గుర్తొస్తేనే ఏడుపొస్తోంది. టీడీపీ పాలనలో అర్ధరాత్రో, అపరాత్రో కరెంట్ ఇచ్చేవాళ్లు. నీళ్ల కోసం వెళ్లి పాముకాటుతో చనిపోయిన వాళ్లున్నారు. ఈ బాధలు పడలేకే చాలామంది పొలాల్ని బీళ్లుగా పెట్టారు.ఇప్పుడు పగలే 9 గంటల విద్యుత్ ఇస్తున్నారు. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. – రవి, చింతలవారిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా
రైతుల నుంచి మంచి స్పందన...
ప్రభుత్వ లక్ష్యం మేరకు పగటిపూటే 9 గంటల పాటు వ్యవసాయ విద్యుత్ ఇవ్వడంలో అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీనిపై రైతుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment