
‘సీమ’కు ద్రోహం చేస్తున్నారు
రాయలసీమ జిల్లాలు కరువు కోరల్లో అల్లాడుతున్నా, అక్కడి పంటలన్నీ ఎండిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని...
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ జిల్లాలు కరువు కోరల్లో అల్లాడుతున్నా, అక్కడి పంటలన్నీ ఎండిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరువుపై ఇప్పటి వరకూ ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడమే దానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీటిని నిల్వ చేయాలని తామెంతగా చెప్పినా వినకుండా 847 అడుగులకు చేరుకోగానే దిగువకు నీటిని వదలి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగినవన్నీ మాఫీ చేసుకుందామని చంద్రబాబుకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రహస్య ఒప్పందం కుదిరినట్లుందని, అందుకే రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి దిగువకు నీళ్లొదులుతున్నారన్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
కర్ణాటకకు ఒక్క లేఖైనా రాశారా?
రాజధాని శంకుస్థాపనకు దేశ,విదేశీ మంత్రులకు శుభలేఖలు ఇచ్చి మరీ ఆహ్వానించిన చంద్రబాబు.. కృష్ణా నది నుంచి నీళ్లు వదలాల్సిందిగా కర్ణాటక సీఎంకు ఒక్క లేఖైనా రాశారా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోతుదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నిర్మాణం జరుగుతూ ఉంటే దానిని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్దచంద్రబాబు నిరాహారదీక్షలు చేయించారని గుర్తుచేశారు. రాయలసీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు.. తన ప్రాంతానికే అన్యాయం చేస్తున్నారన్నారు.