మొదలైన మృగశిర కార్తె
ఆర్బీకేల్లో సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు
అదును దాటకుండా విత్తుకునేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన
సాక్షి, అమరావతి: మృగశిర కార్తె మొదలైంది. వ్యవసాయ పనిముట్లయిన కాడిమేడిలకు పూజలు చేస్తున్న రైతులు సాగు కోసం భూమిని రైతన్నలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల దుక్కిదున్ని పచ్చి రొట్ట వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఏజెన్సీ జిల్లాల్లో వరి పంట విత్తుకుంటున్నారు. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు పలకరించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపింది. పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్టుగా చెబుతున్నారు.
ఆర్బీకేల వద్ద అన్నదాతల సందడి
ఎన్నికలలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్‌లో అదును దాటిపోకుండా రైతులు విత్తుకునేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు ఆర్బీకేల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతం కట్టి నాణ్యతను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చి0ది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీ జోరందుకుంది. వరి సహా ఇతర విత్తనాలను సైతం ఆర్బీకేల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం తమ వివరాల నమోదు కోసం వస్తున్న రైతులు, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు విత్తనాల కోసం వస్తుండటంతో ఆర్బీకేల్లో సందడి మొదలైంది.
పరిహారం ఆదుకుంది
గత ఖరీఫ్‌లో ఏర్పడిన కరువుకు సంబంధించిన పరిహారంతో పాటు రబీలో మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్ల పెట్టుబడి రాయితీ కౌంటింగ్‌కు ముందే జమ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.45 కోట్లు జమైంది. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌కు ముందు జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చి0ది.
ఇప్పటికే 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ
ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో వరి 39.07 లక్షల ఎకరాలు, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 6.35లక్షల ఎకరాల్లో కందులు, 3.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకోసం 6.32 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచారు.
ఇప్పటికే ఆర్బీకేల్లో 3.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశారు. 3.09 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం 4.84 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. 3.52 లక్షల మంది రైతులు 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకెళ్లారు. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 10 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 5 లక్షల బాటిళ్ల నానో యూరియా, 2 లక్షల బాటిళ్ల నానో డీఏపీ ఇఫ్కో ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. కనీసం 5.60 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే మే, జూన్ నెలల్లో రూ.7,500 చొప్పున రైతులు తొలివిడత పెట్టుబడి సాయం అందుకునేవారు. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడేవి.
మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తమకు ఈపాటికే పెట్టుబడి సాయం అంది ఉండేదని రైతులు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment