mrugashira
-
కాడి.. మేడి.. ఖరీఫ్‌కు రెడీ
సాక్షి, అమరావతి: మృగశిర కార్తె మొదలైంది. వ్యవసాయ పనిముట్లయిన కాడిమేడిలకు పూజలు చేస్తున్న రైతులు సాగు కోసం భూమిని రైతన్నలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల దుక్కిదున్ని పచ్చి రొట్ట వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఏజెన్సీ జిల్లాల్లో వరి పంట విత్తుకుంటున్నారు. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు పలకరించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపింది. పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్టుగా చెబుతున్నారు. ఆర్బీకేల వద్ద అన్నదాతల సందడి ఎన్నికలలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోకుండా రైతులు విత్తుకునేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు ఆర్బీకేల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతం కట్టి నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చి0ది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీ జోరందుకుంది. వరి సహా ఇతర విత్తనాలను సైతం ఆర్బీకేల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం తమ వివరాల నమోదు కోసం వస్తున్న రైతులు, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు విత్తనాల కోసం వస్తుండటంతో ఆర్బీకేల్లో సందడి మొదలైంది. పరిహారం ఆదుకుంది గత ఖరీఫ్‌లో ఏర్పడిన కరువుకు సంబంధించిన పరిహారంతో పాటు రబీలో మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్ల పెట్టుబడి రాయితీ కౌంటింగ్‌కు ముందే జమ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.45 కోట్లు జమైంది. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌కు ముందు జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చి0ది.ఇప్పటికే 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో వరి 39.07 లక్షల ఎకరాలు, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 6.35లక్షల ఎకరాల్లో కందులు, 3.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకోసం 6.32 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 3.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశారు. 3.09 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం 4.84 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. 3.52 లక్షల మంది రైతులు 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకెళ్లారు. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 10 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 5 లక్షల బాటిళ్ల నానో యూరియా, 2 లక్షల బాటిళ్ల నానో డీఏపీ ఇఫ్కో ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. కనీసం 5.60 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే మే, జూన్ నెలల్లో రూ.7,500 చొప్పున రైతులు తొలివిడత పెట్టుబడి సాయం అందుకునేవారు. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడేవి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తమకు ఈపాటికే పెట్టుబడి సాయం అంది ఉండేదని రైతులు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆరోగ్యానికి చేపట్టాల్సిందే.. మృగశిర కార్తెలో ఫుల్ డిమాండ్
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు పండుగొప్ప ఇగురు కొర్రమేను కూర కొయ్యింగల పులుసు గుమ్మడి చుక్క కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో కూడా బోలెడు పచ్చి మెత్తళ్ల మామిడి ఎండు మెత్తళ్ల వేపుడు కట్టి చేపలు బొమ్మిడాయిల పులుసు రామల ఇగురు చింతకాయ చిన్న చేపలు చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేపలతో ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో ఉండే ప్రొటీన్ సులువుగా అరిగిపోతుంది. వృద్ధాప్యంలో సహజసిద్ధంగా వచ్చే రుగ్మతలు చాలా వరకూ దూరమవుతాయి. సహజసిద్ధంగా పెరిగే చేపల్లో మేలు చేసే ప్రొటీన్, ఇతర విలువలు ఉంటాయి. – పిండి సాయిబాబు, విశ్రాంత జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎస్కేబీఆర్ కాలేజీ, అమలాపురం -
Fish Prices: కొండెక్కిన చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుత సీజన్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం మృగశిర కార్తె సందర్భంగా ధర ఎంతైనా సరే కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఈ రోజు తప్పకుండా చేపలు తినాలనే నానుడితో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు పోటెత్తారు. దీంతో రాంనగర్, బేగంబజార్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రాంనగర్ చేపల మార్కెట్లో జనం బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా తక్కువ సమయం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు అన్ని మార్కెట్లలో దాదాపు చేపలు అమ్ముడు పోయాయి. కొరమీను కిలో రూ.700 నుంచి రూ.800 ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. మామూలు రోజుల్లో ఇదే చేప ధర రూ.400 నుంచి 550 వరకు ఉంటుంది. అలాగే.. రవ్వ, బొచ్చ చేపలు కిలోకు ఏకంగా రూ.150 నుంచి రూ. 250 ధర పలికాయి. కరోనా నిబంధనలు గాలికి.. ఎలాగైనా చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారేగానీ.. కరోనా నిబంధనలు అసలు పట్టించుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో జనం గుంపులు గుంపులుగా తరలివచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచనలను ప్రజలు బేఖాతరు చేశారు. -
చిరువాక!
మృగశిర కార్తె రాకకు ముందు నుంచే అడపా దడపా వానలు కురుస్తున్నాయి. ఏరువాక పౌర్ణమితో అన్నదాతలు పనులు సాగించారు. నేలతల్లికి ప్రణమిల్లి అరకలు కట్టడం ప్రారంభించారు. వర్షాధారపంటల సమయమొచ్చిందని గ్రామాల్లో కోయిల కుహు కుహూలు వినిపిస్తున్నా.. చాలా మంది రైతుల ఇంట కాలు దువ్వి రంకేసే ఎద్దులే లేకుండా పోయాయి. పూర్తిగా ఎద్దులతోనే సేద్యం చేసే కాలం మళ్లీ రావాలని అందరూ కోరుకుందామని అంటున్నారు వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లె గ్రామ అభ్యుదయ రైతు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు కొమ్మూరి విజయకుమార్. వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు అయిన ఆయన చిరుధాన్యపు పంటల వర్షాధార సాగులో మెళకువలు ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. ‘సోమవారం నుంచి మృగశిర కార్తెలోకి ప్రవేశించాం. తొలకరి చినుకులు పడుతున్నందున ముందస్తు సేద్యాలు (దుక్కులు) చేసుకుంటే మంచిది. సేద్యం వలన భూమి గుల్లబారుతుంది. గడ్డి గింజలు మొలుస్తాయి. మృగశిర కార్తె (ఈ నెల 21న) అమావాస్యతో ముగుస్తుంది. 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభవుతుంది. ఆరుద్రలో వానాకాలపు పంటలు ఆనందంగా సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు సాగుచేసే రైతులంతా ముందస్తుగా భూమిని తేలికగా దున్నుకోవాలి. లోతు దుక్కి అవసరం లేదు. ఆరుద్ర కార్తె ప్రారంభమైన వెంటనే చిరుధాన్యపు పంటలను సాగు చేసుకోవచ్చు. ఆరుద్రలోనే ఆరికలు చిరుధాన్యాల్లో ఏకైక దీర్ఘకాలిక పంట ఆరిక (అరిక). పంట కాలం 150 నుంచి 160 రోజులు. చలి ముదరక ముందే పంట చేతికి రావాలి. అందుకే ఈ పంటను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవాలి. ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. చిరుధాన్య పంట ఏదైనా ఒంటరిగా కాకుండా కచ్చితంగా అంతరపంటలు కూడా వేసుకోవాలి. ఆరికలో అంతర పంటలుగా కంది, సీతమ్మ జొన్న, అలసందలు, అనుములు, ఆముదాలు సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. అలాగే చేనిమటిక, గోగులు కూడా వేసుకోవచ్చు. అంతర పంటలు వేసినా ఆరిక ధాన్యం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జడ కొర్ర, ఎర్ర కొర్ర మేలు కొర్ర పంటకు తేలికపాటి సేద్యం సరిపోతుంది. విత్తనాలు ఎకరాకు మూడు కిలోలు వేసుకోవాలి. పంట కాలం 80–90 రోజులు. జడకొర్ర, ఎర్రకొర్రలు మంచి దిగుబడిని ఇస్తాయి. ఎకరాకు 6–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంటకు పశువుల ఎరువు లేదా పొలంలో గొర్రెలు, ఆవులను మంద కట్టిస్తే ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పురుగుమందులు, రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. రుచికరం.. సామ భోజనం చిరుధాన్యపు పంటల్లో రాజుగా పేరు పొందింది సామ. సామ బియ్యపు భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. పంట కాలం 100–115 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. దిగుబడి 5–7 క్వింటాళ్లు వస్తుంది. బరిగెలు బంగారం బరిగెల (ఒరిగెల) గింజలు బంగారు వర్ణంలో ఉంటాయి. విత్తిన 70 రోజులకే పంట చేతికి వస్తుంది. తేలికపాటి సేద్యం చేస్తే సరిపోతుంది. విత్తనం ఎకరాకు మూడు కిలోలు చాలు. దిగుబడి 8–10 క్వింటాళ్లు వస్తుంది. పశువులు ఈ మేతను బాగా ఇష్టపడతాయి. ఊద.. ఎరువును బట్టి దిగుబడి ఊదల పంట కాలం 120 రోజులు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. పశువుల ఎరువు, చెరువుమట్టి తోలి పంట పెడితే 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పశువుల ఎరువు ఎక్కువ పొలానికి తోలి సాగు చేస్తే రెట్టింపు దిగుబడి వస్తుంది. ఊద గడ్డి పశువులు ఇష్టంగా తింటాయి. సేంద్రియ సేద్యంలో ఈ పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించవు. అండుకొర్రలు.. ఎప్పుడైనా విత్తుకోవచ్చు అండుకొర్రల అసలు పేరు అంటుకొర్రలు. పూర్వం నుంచి కర్ణాటక రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో పండించేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందింది. ఎకరం సాగుకు 3 కిలోల విత్తనం చాలు. ఈ పంటను ఏడాది పొడవునా ఎప్పుడైనా విత్తుకోవచ్చు. పంట కాలం 100–105 రోజులు. జిగురు చౌడు భూములు మినహా అన్ని రకాల నేలల్లో అండుకొర్ర పండుతుంది. ఎకరానికి ఆరికలు 4 కిలోలు, మిగతావన్నీ 3 కిలోల విత్తన మోతాదు వేసుకోవాలి. విత్తే సమయంలో కిలో విత్తనానికి 4 కిలోల ఇసుక గానీ లేదా 4 కిలోల బియ్యపు నూకలు గానీ కలిపి గొర్రుతో వెద పెట్టడం గానీ, చల్లుకోవడం గానీ చేయాలి. చిరుధాన్య విత్తనాలను నానబెట్టి గానీ గానీ, నారు పోసి గానీ సాగు చేయకూడదు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు నాణ్యమైన రైతువారీ విత్తనం వేసుకోవడం ఉత్తమమ’ని విజయకుమార్ (98496 48498) సూచిస్తున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా -
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
63,500 మందికి చేప ప్రసాదం సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 8, 9 తేదీల్లో(బుధ, గురువారాల్లో) మొత్తం 63,500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఒక్కో చేపను రూ.15 చొప్పున విక్రయించటం ద్వారా మత్స్య శాఖకు రూ.9,52,500 ఆదాయం సమకూరింది. బుధవారం మొదలైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 9.00 గంటల వరకు కొనసాగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం నగరానికి తరలివచ్చారు. రెండు రోజుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. చేప పంపిణీ కోసం పక్కా ఏర్పాట్లు చేసిన పోలీసు, రెవెన్యూ, ఆర్అండ్బీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మత్స్య, సమాచార, విద్యుత్తు తదితర శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన వారికి, వారి సహాయకులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగ, భోజనం వంటి సదుపాయాలు అందించిన వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల సేవలను కలెక్టర్ కొనియాడారు. మరోవైపు బత్తిని సోదరులు గురువారం ఉదయం నుంచి చేప ప్రసాదాన్ని పాతబస్తీ దూద్‌బౌలిలోని స్వగృహంలో ఉచితంగా పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది చేప ప్రసాదం కోసం తరలిరావడంతో ఇక్కడి వీధులన్నీ కిటకిటలాడాయి. మత్స్య శాఖ తరపున చేప పిల్లలను అందుబాటులో ఉంచకపోవడంతో స్థానికులు కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి అనధికారికంగా ఐదారు కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో చేప పిల్లను రూ.200 నుంచి 500 వరకు విక్రయించారు. చేపతో పాటు ప్రసాదాన్ని కూడా అందజేస్తే మరో రూ.100 లు అధికంగా వసూలు చేశారు. -
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
-
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
- బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం - కంట్రోల్ రూమ్‌తోపాటు చేపలకు, టోకెన్లకు వేర్వేరుగా కౌంటర్లు - వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు - 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రశాం తంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంప్రదాయబద్ధంగా నిష్ట పూజల అనంతరం బుధవారం ఉదయం 8.30 గంట లకు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాయికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయటంతో ఈ కార్యక్రమం మొదలైంది. బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం 8.30 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం తరలి వచ్చారు. చేప ప్రసాదం తీసుకునే వారు, వారి సహాయకులు కలిపి మొత్తం 60 వేల మంది వచ్చినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీకి 32 టోకెన్ కౌంటర్లు, 40 చేప పిల్లల కౌంటర్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లతోపాటు సాధారణ క్యూలైన్ల కోసం ఏడంచెలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. 35 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ పర్యవేక్షించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పరిశీలించారు. ఆరు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు పర్యవేక్షిం చాయి. రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చేప ప్రసాదం పంపిణీకి లక్ష చేప పిల్లలను అందుబాటులో ఉంచిన మత్స్య శాఖ టోకెన్‌కు రూ.15 చెల్లించటం ద్వారా చేప పిల్లలను విక్రయించింది. జలమండలి మంచినీటి సరఫరాతోపాటు 2.50 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, తొమ్మిది మంది తహసీల్దార్లు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనులను మూడు షిప్టుల్లో జీహెచ్ఎంసీ కార్మికులు నిర్వర్తించారు. తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం, అల్పాహారం, మజ్జిగ అందజేశాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్‌లు, 108 వాహనాలు ఏర్పాటు చేసింది. -
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సన్నద్ధం
ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, టోకెన్లకు కౌంటర్లు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఆరు శాఖల ఆధ్వర్యంలో పక్కాగా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో(బుధ, గురు వారాల్లో) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకుంది. రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్యర్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి 10 వేల చేప పిల్లలతో ప్రత్యేక డ్రమ్ములను మత్స్య శాఖ అందుబాటులో ఉంచింది. చేప ప్రసాదం పంపిణీకి టోకెన్లను అందజేయనున్నారు. టోకెన్‌కు రూ.15 చెల్లించి చేప పిల్లను పొందాలి. మహిళలు, పురుషులు, వికలాంగులు, వృద్ధులు, వీఐపీలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. తొక్కిసలాట, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జలమండలి మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ఏర్పాట్లు.. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా తొక్కిసలాట లాంటి ఘటనలు జరగ కుండా ఏడు వరుసల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్ మొదలైన ఏర్పాట్లు చేయగా, జీహెచ్ఎంసీ తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చింది. ప్రజల సౌకర్యార్థం 80 మంది వాలంటీర్లను నియమించారు.