ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
- బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం
- కంట్రోల్ రూమ్‌తోపాటు చేపలకు, టోకెన్లకు వేర్వేరుగా కౌంటర్లు
- వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు
- 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రశాం తంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంప్రదాయబద్ధంగా నిష్ట పూజల అనంతరం బుధవారం ఉదయం 8.30 గంట లకు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాయికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయటంతో ఈ కార్యక్రమం మొదలైంది. బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం 8.30 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం తరలి వచ్చారు.
చేప ప్రసాదం తీసుకునే వారు, వారి సహాయకులు కలిపి మొత్తం 60 వేల మంది వచ్చినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీకి 32 టోకెన్ కౌంటర్లు, 40 చేప పిల్లల కౌంటర్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లతోపాటు సాధారణ క్యూలైన్ల కోసం ఏడంచెలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. 35 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ పర్యవేక్షించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పరిశీలించారు.
ఆరు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు..
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలు పర్యవేక్షిం చాయి. రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చేప ప్రసాదం పంపిణీకి లక్ష చేప పిల్లలను అందుబాటులో ఉంచిన మత్స్య శాఖ టోకెన్‌కు రూ.15 చెల్లించటం ద్వారా చేప పిల్లలను విక్రయించింది. జలమండలి మంచినీటి సరఫరాతోపాటు 2.50 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, తొమ్మిది మంది తహసీల్దార్లు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనులను మూడు షిప్టుల్లో జీహెచ్‌ఎంసీ కార్మికులు నిర్వర్తించారు. తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం, అల్పాహారం, మజ్జిగ అందజేశాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్‌లు, 108 వాహనాలు ఏర్పాటు చేసింది.