tobacco board
-
పొగాకు వేలానికి వేళాయె..!
పొగాకు వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీజియన్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాలను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే కర్నాటకలో వేలం చివరి దశకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అవే ధరలు వస్తే తమ పంట పండినట్టేనని సంబరపడుతున్నారు. కందుకూరు: ఈ ఏడాది సాగులో మాండూస్ లాంటి తుఫాన్లు ఇబ్బంది పెట్టినా పొగాకు సాగులో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు విపరీత డిమాండ్ రావడం, పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిన పొగాకు అమ్మకాల్లో కిలో పొగాకు రికార్డు ధరల పలకడం రైతుల్లో ఉత్సాహం నింపింది. 2022–23 సీజన్‌కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 61,639 హెక్టార్లలో పొగాకు రైతులు సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తి రావచ్చునని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈనెలాఖరు నుంచి పొగాకు వేలం అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 23 నుంచి దశల వారీగా.. పొగాకు వేలాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించేలా పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. 23వ తేదీన తొలుత ఒంగోలు, పొదిలి, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో, మార్చి 9న రెండో దశలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధి కందుకూరు–1,2 కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని కనిగిరి, ఒంగోలు, టంగుటూరు కేంద్రాల్లో వేలం ప్రారంభం కానుంది. కర్నాటకలో ఈ ఏడాది కిలో పొగాకు రూ.274ల వరకు పలికింది. ఇక్కడ గతేడాది కిలో పొగాకు అత్యధిక ధర రూ.184 వచ్చింది. అదే కిలో సరాసరి ధర అత్యధికంగా రీజియన్ పరిధిలో రూ.172 వరకు వచ్చింది. కర్ణాటక మార్కెట్లో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో అదే స్థాయిలో ఇక్కడ కూడా రేట్లు ఉంటాయనే ఆశలు రైతులు పెట్టుకున్నారు. అధిక విస్తీర్ణంలో సాగు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో తేలిక నేలల పరిధిలో (ఎస్ఎల్ఎస్) నెల్లూరు జిల్లాలోని కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలున్నాయి. నల్లరేగడి నేలల (ఎస్బీఎస్) పరిధిలో జిల్లాలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. 2022–23 సీజన్‌కు గాను 57,744 హెక్టార్లలో పొగాకు సాగుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే రికార్డు స్థాయిలో 61,639 హెక్టార్లలో పంట సాగైంది. అదే 2021–22లో బోర్డు 49,889.15 హెక్టార్లలో పంట సాగుకు బోర్డు అనుమతిస్తే సాగైంది మాత్రం 46,647.01 హెక్టార్లు మాత్రమే. అంటే బోర్డు అనుమతికంటే తక్కువగా సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం బోర్డు అనుమతిని మించి సాగు చేపట్టారు. గత ఏడాది వేలంలో పొగాకు మంచి ధరలు రావడం, ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక శాతం మంది రైతులు పొగాకు సాగువైపు మొగ్గు చూపారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినా రైతులు మాత్రం తిరిగి పొగాకునే సాగు చేశారు. జనవరి చివరి వరకు సాగుచేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. దీని వల్ల ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు పంట సాగైందని అధికారులు చెప్తున్నారు. 99 మిలియన్ కేజీల ఉత్పత్తి అంచనా: పంట సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు పొగాకు ఉత్పత్తి కూడా పెరుగుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్డు 11 వేలం కేంద్రాల పరిధిలో 87 మిలియన్ కేజీల పొగాకును విక్రయించుకునేందుకు అనుమతించింది. కానీ అనుమతిని మించి 12 మిలియన్ కేజీలు అధికంగా అంటే 99 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని బోర్డు అధికారుల అంచనా. అలాగే ఈ ఏడాది క్యూరింగ్‌లో నాణ్యత కూడా పర్వాలేదని చెప్తున్నారు. 55–60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్(గ్రేడ్–1) పొగాకు వస్తుందని, 25 శాతం మీడియం, మరో 25 శాతం లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఈ ఏడాది పొగాకు రైతులకు ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. -
సీఎం జగన్‌ను కలిసిన పొగాకు బోర్డు చైర్మన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో మార్క్‌ఫెడ్ జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు మంచి ధర లభించిందని ఆయన అన్నారు. రఘునాథ్ బాబు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మార్కెటింగ్‌లో జోక్యం చేసుకోవడం వల్ల రైతులు అధిక ధరకు అమ్ముకోగలిగారని, దీనివల్ల రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ‘అది మీ తండ్రులు, తాతల వల్ల కూడా కాదు’ -
పొగాకు రైతుకు రూ.130 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో పంట ధర పెరుగుతోంది. దీంతో రైతుకు మంచి రేటు వస్తోంది. జూన్ నెలాఖరు వరకు ముప్పుతిప్పలు పెట్టిన వ్యాపారులు ప్రభుత్వ జోక్యంతో పంట కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ►అకాల వర్షాల కారణంగా తెగుళ్లు సోకి ఈ సీజనులో పొగాకు దిగుబడి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం టుబాకో బోర్డు ఆధ్వర్యంలో వేలం కేంద్రాలను ప్రారంభించినా కోవిడ్ కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి చౌకగా కొనుగోళ్లకు ప్రయత్నించారు. ►కొందరు రైతులు లోగ్రేడ్ పొగాకును కిలో రూ.60 నుంచి రూ.70లోపే విక్రయించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో రైతుల నుంచి 45 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. నష్టపోతున్న పొగాకు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పరిస్ధితి వివరించడంతో వెంటనే స్పందించి కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. ►జూలై మొదటి వారం నుంచి మార్క్‌ఫెడ్ అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులతో పోటీపడి పొగాకు కొనుగోలు చేయడంతో ఇప్పటివరకు 49 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకోగలిగారు. ప్రభుత్వ జోక్యం కారణంగా కొన్ని రకాల పొగాకుకు కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెరగడంతో రైతులు లబ్ధి పొందారు. ‘లోగ్రేడ్ పొగాకు ధర కిలో రూ.40 – రూ.50 లోపే పలకడంతో విక్రయించలేక ఇంటికి తెచ్చా. లారీ కిరాయిల కోసం రూ.వేలల్లో ఖర్చయింది. చివరి ఆశగా ముఖ్యమంత్రి జగన్‌ను కలసి మా దుస్థితిని వివరించడంతో రెండు రోజుల్లోనే అధికారులతో సమావేశం నిర్వహించి పొగాకు రైతుకు అండగా నిర్ణయం తీసుకున్నారు. మార్క్‌ఫెడ్‌కు అధిక రేటుకు అమ్ముకుంటున్నాం. ఆ డబ్బుతో మళ్లీ సాగుకు సమాయత్తం అవుతున్నాం’ –రావూరి శ్రీకాంత్, కలిగిరి, నెల్లూరు జిల్లా. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులు రూ.130 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరిగాయి. దేశంలో మొదటిసారిగా పొగాకు విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది – మారెడ్డి సుబ్బారెడ్డి (ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు) -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
సాక్షి, కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు వేలానికి ఉంచిన బేళ్లలో ప్రతిరోజు వంద నుంచి 200 పొగాకు బేళ్లు కొనకుండా వ్యాపారులు వెనక్కి తిప్పి పంపుతుండటంతో కడుపు మండిన రైతులు ఆర్అండ్బీ రోడ్డు ఎక్కి ధర్నా చేసిన సంఘటన కొండపిలో జరిగింది. కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం వేలంకేంద్రం పరిధిలోని అయ్యవారిపాలెం, జువ్విగుంట, తంగెళ్ళ గ్రామాల నుంచి రైతులు 1047 బేళ్లను అమ్మకాలకు పెట్టారు. వేలం కేంద్రం అధికారి మధుసూదనరావు వేలాన్ని ప్రారంభించగా 74 బేళ్లు బిడ్డింగ్ కాగా అందులో 35 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో కొనకుండా తిరస్కరించారు. దీంతో పరిస్థితి గమనించిన రైతులు ఒక్కసారిగా వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వేలం జరిగిన బేళ్లలో సగం బేల్స్‌ను కొనకుండా తిరస్కరిస్తే ఇక రైతులు అమ్ముకునేది ఏంటని వ్యాపారులను నిలదీసి వేలాన్ని అడ్డుకుని నిలిపివేశారు. అనంతరం వందల మంది రైతులు బోర్డు ముందు ఆర్అండ్బీ రోడ్డు మీద బైఠాయించి అర్ధగంటకు పైగా తమ నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని రైతులను కోరటంతో కొద్దిసేపు ధర్నా చేసి విరమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోర్డు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు వందల సంఖ్యలో పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు ఆవేదన చెందారు. ధరలు దిగ్గోసి కొంటున్నా వచ్చినదే దక్కుదల అని అమ్ముకుని నష్ట పోతున్నారన్నారు. పొగాకు బాగోలేదని, ఆర్డర్లు లేవని రకరకాల సాకులతో తెచ్చిన బేళ్లను సైతం కొనకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో తెచ్చిన బేళ్లను రైతులు ఇళ్లకు తీసుకెళ్లి తీసుకురావాలంటే రవాణా ఖర్చులు సైతం తడిసిమోపెడవుతున్నాయని తెలిపారు. ఇక మీదట రైతులు పొగాకు వేసే పరిస్థితి సైతం లేదన్నారు. బోర్డు తగిన చర్యలు తీసుకుని తెచ్చిన బేళ్లను వెనక్కి పంపకుండా వ్యాపారులతో కొనిపించాలన్నారు. కార్యక్రమంలో పొగాకు రైతులు పాల్గొన్నారు. వ్యాపారులు నోబిడ్లు లేకుండా చూడాలి వ్యాపారులు ప్రతి రోజు వందకు పైగా బేళ్లను కొనకుండా వెనక్కి పంపుతున్నారు. ఈవిధంగా కొంటే రైతులు పొగాకు అమ్ముకోలేరు. 74 బేళ్లకు పాట పెడితే 34 బేళ్లను నోబిడ్ పెట్టాల్సి వచ్చింది. ఈవిధంగా అయితే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వెనక్కి తీసుకెళ్లి తీసుకురావటంతోనే కాలం సరిపోతుంది. వ్యాపారులు నోబిడ్లు తగ్గించి కొనుగోలు చేయాలి. - కె.మధుసూదనరావు, వేలంకేంద్రం అధికారి, కొండపి చాలా ఘోరంగా ఉంది కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు పరిస్థితి ఘోరంగా ఉంది. గిట్టుబాటు ధరల గురించి ఆశలు వదులుకున్న రైతులు ఏదో ఒక రేటుకు పొగాకు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నా వ్యాపారులు కొనటం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో రైతులు తెచ్చిన బేళ్లను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి గురించి బోర్డు పట్టించుకుని చర్యలు తీసుకోవాలి. - ఎల్.భాస్కర్, అయ్యవారిపాలెం, పొగాకు రైతు పొగాకు రైతుల పరిస్థితి దీనంగా ఉంది నీరులేక, మల్లె పెరిగి దిగుబడి రాక అష్టకష్టాలు పడి పండించిన పంటను వ్యాపారులు దోచుకుంటున్నారు. దోపిడీకి మేము సహించి బేళ్లు వదులుకుంటున్నా వివిధ సాకులతో తెచ్చిన బేళ్లను కొనకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. పొగాకు రైతుల బాధలు ఎవరూ పట్టించుకోవటం లేదు. - బొట్లగుంట రమణయ్య, జువ్విగుంట -
పొగాకు రైతును ఆదుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: సంక్షోభంలో ఉన్న పొగాకు రైతుల్ని ఆదుకుని తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వర్జీనియా పొగాకుకు ధర లేక, అష్టకష్టాలు పడుతూ వేలం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. పొగాకు ధరల సంక్షోభంపై సీఎం సోమవారం వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు, సీఎం కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, పొగాకు బోర్డు, వ్యవసాయాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు తాను ఇటీవల ఈ వ్యవహారంపై గుంటూరులో పొగాకు బోర్డు అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, బయ్యర్లతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. మంత్రి సమీక్ష అనంతరం నాణ్యత లేదన్న సాకుతో పొగాకును తిరస్కరించే శాతం తగ్గిందని, ధర కూడా స్వల్పంగా పెరిగిందని పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు వివరించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతుకు న్యాయం చేసేలా ధర పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. పొగాకును కొనుగోలు చేసే ఐటీసీ వంటి పెద్ద కంపెనీల ప్రతినిధులు, ఇతర బయ్యర్లతో తానే స్వయంగా త్వరలో మాట్లాడతానని, ఆ మేరకు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేయాల్సింది పొగాకు కంపెనీలే కాబట్టి ఆ మేరకు వారితోనే చర్చలు జరిపితే సత్ఫలితాలు వస్తాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ధర దగా..
► నెల రోజులుగా పడిపోతున్న పొగాకు ధరలు ► సగటున కొనుగోలు ధర రూ.130 ► పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ► చోద్యం చూస్తున్న టుబాకో బోర్డు ► తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెల రోజులుగా పొగాకు ధరలు పతనమవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కిలో పొగాకు ఉత్పతికి రూ.145కుపైగా ఖర్చవుతుండగా ప్రస్తుతం కొనుగోలు ధరల ప్రకారం.. సగటున రూ.130కి మించి రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 130 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా ప్రకాశం జిల్లాకు 73 మిలియన్ కిలోలుగా నిర్ధారించారు. జిల్లా పరిధిలో ఈ ఏడాది 75 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. కరువు నేపథ్యంలో ఈ ఏడాది ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుత అంచనా మేరకు 50 మిలియన్ కిలోలకు మించి ఉత్పత్తి లేదు. పతనమైన ధరలు.. ఈ ఏడాది మార్చి 13 నుంచి జిల్లాలో పొగాకు వేలం పాటలు మొదలయ్యాయి. ప్రారంభంలో బ్రైట్ రకం కిలో రూ.160, మీడియం గ్రేడ్ రూ.140, లోగ్రేడ్ రూ.100కు తగ్గకుండా ధరలు ఉండేలా చూడాలని జిల్లా రైతులు, రైతు సంఘాలు గుంటూరులో జరిగిన టుబాకో బోర్డు మీటింగ్‌లో డిమాండ్ చేశారు.బ్రైట్ గ్రేడ్ రూ.165కు కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన రకాలకు కూడా వ్యాపారులు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశారు.ఆ తర్వాత ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. గత నెల రోజులుగా ధరలు మరింతగా తగ్గాయి. తాజాగా జిల్లాలో మీడియం గ్రేడ్ రూ.100 అమ్ముడుపోతుండగా లోగ్రేడ్ రూ.65కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సగటు ధర రూ.140 పలుకుతుండగా ప్రకాశం జిల్లాలో ఇది మరింత తగ్గి రూ.132గా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక నోబిడ్ పెద్ద ఎత్తున ఉంటుంది. జిల్లాకు 73 మిలియన్ కిలోల నిర్దేశిత లక్ష్యం కాగా ఉత్పత్తి 50 మిలియన్ కిలోలకు మించే పరిస్థితి లేదు. 25 మిలియన్ కిలోల కొనుగోలు.. ఇప్పటి వరకు జిల్లా పరిధిలో 25 మిలియన్ కిలోల పొగాకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రైతుల వద్ద మీడియం గ్రేడ్, లోగ్రేడ్ అధికంగా ఉంది. ప్రస్తుత కొనుగోళ్ల సరళే కొనసాగితే సగటు ధరలు రూ.110కు పడిపోయే అవకాశం ఉంది. అధిక పెట్టుబడులతో పొగాకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టుబాకో బోర్డు పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలిచ్చేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారులకో న్యాయం.. రైతుకో న్యాయం.. జీఎస్టి నేపథ్యంలో పొగాకుపై పన్ను సరికాదని ఆందోళనలకు దిగుతున్న వ్యాపారులు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక నష్టాల పాల్జేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారుల కోసం ఒక రోజు వేలం పాటలు ఆపించిన వ్యాపారులు, ఇతర వర్గాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ ఇంతే యూనిట్‌తో నిరసనలు తెలియజేయాల్సి ఉంది. టుబాకో బోర్డు చైర్మన్ గిట్టుబాటు ధర విషయం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం పొగాకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దాఖలాల్లేవు. టుబాకో బోర్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పొగాకు వ్యాపారులు, రైతులు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం నేత దుగ్గినేని గోపినా«థ్ డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు. -
పొగాకు సాగులో జాగ్రత్తలు పాటించాలి
రీజినల్ మేనేజర్ రత్నసాగర్ మర్రిపాడు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొగాకు రైతులు సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని భారత పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ రత్నసాగర్ పేర్కొన్నారు. డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో 3,992 మంది రైతులకు పొగాకు పండించేందుకు 3,180 బ్యారెన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను 7,683 హెక్టార్లలో నాట్లు వేసేందుకు బోర్డు అనుమతిని ఇచ్చిందని తెలిపారు. దాంట్లో 10.8 మిలియన్ కిలోల పొగాకు పండించాలని సూచించినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనీసం సగభాగం కూడా వేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 199 హెక్టార్లలో మాత్రమే పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు వేసిన 190 హెక్టార్లలో కూడా 60 హెక్టార్లలో మొక్కలన్ని మాడిపోయి చనిపోయాయని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 3130 హెక్టార్లలో పొగాకు నాట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు తడులు నీళ్లు కలిపి పొగాకు నాట్లు వేసినప్పటికీ దిగుబడి పెరిగే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. వేలం కేంద్రం పరిధిలో డీసీపల్లి, ఖాన్‌సాహెబ్‌పేట, బంట్లపల్లి, కోనసముద్రం, మర్రిపాడు గ్రామాల్లో తోటలను పరిశీలించారు. వారి వెంట క్షేత్రాధికారులు గిరిరాజ్‌కుమార్, బెనర్జీ, పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి
హైదరాబాద్ : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫమలైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గతేడాది పొగాకు కిలోకు రూ.174 ఉంటే ఈ ఏడాది రూ.110-117 ఉందని ఆయన అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పొగాకు రైతులను పరామర్శించి, గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన మండిపడ్డారు. ఈ నెల 14న పొగాకు అమ్మే అన్ని ఫ్లాట్ ఫాంల దగ్గర వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపడుతుందని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామన్నారు. పొగాకు పంటకు మద్దతు ధర లేక టంగుటూరులో కొండల్రావు అనే రైతు గుండెపోటుతో మరణించాడని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొగాకు కిలోకు రూ.150కు పెంచాలని డిమాండ్ చేశారు.