పొగాకు పంట
పొగాకు వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీజియన్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాలను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే కర్నాటకలో వేలం చివరి దశకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అవే ధరలు వస్తే తమ పంట పండినట్టేనని సంబరపడుతున్నారు.
కందుకూరు: ఈ ఏడాది సాగులో మాండూస్ లాంటి తుఫాన్‌లు ఇబ్బంది పెట్టినా పొగాకు సాగులో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకుకు విపరీత డిమాండ్ రావడం, పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిన పొగాకు అమ్మకాల్లో కిలో పొగాకు రికార్డు ధరల పలకడం రైతుల్లో ఉత్సాహం నింపింది. 2022–23 సీజన్‌కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు.
పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 61,639 హెక్టార్లలో పొగాకు రైతులు సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తి రావచ్చునని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈనెలాఖరు నుంచి పొగాకు వేలం అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
23 నుంచి దశల వారీగా..
పొగాకు వేలాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించేలా పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. 23వ తేదీన తొలుత ఒంగోలు, పొదిలి, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో, మార్చి 9న రెండో దశలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధి కందుకూరు–1,2 కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని కనిగిరి, ఒంగోలు, టంగుటూరు కేంద్రాల్లో వేలం ప్రారంభం కానుంది.
కర్నాటకలో ఈ ఏడాది కిలో పొగాకు రూ.274ల వరకు పలికింది. ఇక్కడ గతేడాది కిలో పొగాకు అత్యధిక ధర రూ.184 వచ్చింది. అదే కిలో సరాసరి ధర అత్యధికంగా రీజియన్ పరిధిలో రూ.172 వరకు వచ్చింది. కర్ణాటక మార్కెట్‌లో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో అదే స్థాయిలో ఇక్కడ కూడా రేట్లు ఉంటాయనే ఆశలు రైతులు పెట్టుకున్నారు.
అధిక విస్తీర్ణంలో సాగు:
పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో తేలిక నేలల పరిధిలో (ఎస్‌ఎల్‌ఎస్) నెల్లూరు జిల్లాలోని కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలున్నాయి. నల్లరేగడి నేలల (ఎస్‌బీఎస్) పరిధిలో జిల్లాలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి.
2022–23 సీజన్‌కు గాను 57,744 హెక్టార్లలో పొగాకు సాగుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే రికార్డు స్థాయిలో 61,639 హెక్టార్లలో పంట సాగైంది. అదే 2021–22లో బోర్డు 49,889.15 హెక్టార్లలో పంట సాగుకు బోర్డు అనుమతిస్తే సాగైంది మాత్రం 46,647.01 హెక్టార్లు మాత్రమే. అంటే బోర్డు అనుమతికంటే తక్కువగా సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం బోర్డు అనుమతిని మించి సాగు చేపట్టారు.
గత ఏడాది వేలంలో పొగాకు మంచి ధరలు రావడం, ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక శాతం మంది రైతులు పొగాకు సాగువైపు మొగ్గు చూపారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినా రైతులు మాత్రం తిరిగి పొగాకునే సాగు చేశారు. జనవరి చివరి వరకు సాగుచేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. దీని వల్ల ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు పంట సాగైందని అధికారులు చెప్తున్నారు.
99 మిలియన్ కేజీల ఉత్పత్తి అంచనా:
పంట సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు పొగాకు ఉత్పత్తి కూడా పెరుగుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్డు 11 వేలం కేంద్రాల పరిధిలో 87 మిలియన్ కేజీల పొగాకును విక్రయించుకునేందుకు అనుమతించింది. కానీ అనుమతిని మించి 12 మిలియన్ కేజీలు అధికంగా అంటే 99 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని బోర్డు అధికారుల అంచనా.
అలాగే ఈ ఏడాది క్యూరింగ్‌లో నాణ్యత కూడా పర్వాలేదని చెప్తున్నారు. 55–60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్(గ్రేడ్–1) పొగాకు వస్తుందని, 25 శాతం మీడియం, మరో 25 శాతం లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఈ ఏడాది పొగాకు రైతులకు ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment