Tobacco cultivation
-
పొగాకు వేలానికి వేళాయె..!
పొగాకు వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీజియన్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాలను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే కర్నాటకలో వేలం చివరి దశకు చేరుకుంది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అవే ధరలు వస్తే తమ పంట పండినట్టేనని సంబరపడుతున్నారు. కందుకూరు: ఈ ఏడాది సాగులో మాండూస్ లాంటి తుఫాన్లు ఇబ్బంది పెట్టినా పొగాకు సాగులో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు విపరీత డిమాండ్ రావడం, పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిన పొగాకు అమ్మకాల్లో కిలో పొగాకు రికార్డు ధరల పలకడం రైతుల్లో ఉత్సాహం నింపింది. 2022–23 సీజన్‌కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 61,639 హెక్టార్లలో పొగాకు రైతులు సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తి రావచ్చునని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈనెలాఖరు నుంచి పొగాకు వేలం అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 23 నుంచి దశల వారీగా.. పొగాకు వేలాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించేలా పొగాకు బోర్డు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. 23వ తేదీన తొలుత ఒంగోలు, పొదిలి, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో, మార్చి 9న రెండో దశలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధి కందుకూరు–1,2 కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని కనిగిరి, ఒంగోలు, టంగుటూరు కేంద్రాల్లో వేలం ప్రారంభం కానుంది. కర్నాటకలో ఈ ఏడాది కిలో పొగాకు రూ.274ల వరకు పలికింది. ఇక్కడ గతేడాది కిలో పొగాకు అత్యధిక ధర రూ.184 వచ్చింది. అదే కిలో సరాసరి ధర అత్యధికంగా రీజియన్ పరిధిలో రూ.172 వరకు వచ్చింది. కర్ణాటక మార్కెట్లో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ధరలు రావడంతో అదే స్థాయిలో ఇక్కడ కూడా రేట్లు ఉంటాయనే ఆశలు రైతులు పెట్టుకున్నారు. అధిక విస్తీర్ణంలో సాగు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో తేలిక నేలల పరిధిలో (ఎస్ఎల్ఎస్) నెల్లూరు జిల్లాలోని కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలతో పాటు జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలున్నాయి. నల్లరేగడి నేలల (ఎస్బీఎస్) పరిధిలో జిల్లాలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. 2022–23 సీజన్‌కు గాను 57,744 హెక్టార్లలో పొగాకు సాగుకు బోర్డు అనుమతిచ్చింది. అయితే రికార్డు స్థాయిలో 61,639 హెక్టార్లలో పంట సాగైంది. అదే 2021–22లో బోర్డు 49,889.15 హెక్టార్లలో పంట సాగుకు బోర్డు అనుమతిస్తే సాగైంది మాత్రం 46,647.01 హెక్టార్లు మాత్రమే. అంటే బోర్డు అనుమతికంటే తక్కువగా సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం బోర్డు అనుమతిని మించి సాగు చేపట్టారు. గత ఏడాది వేలంలో పొగాకు మంచి ధరలు రావడం, ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక శాతం మంది రైతులు పొగాకు సాగువైపు మొగ్గు చూపారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయినా రైతులు మాత్రం తిరిగి పొగాకునే సాగు చేశారు. జనవరి చివరి వరకు సాగుచేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. దీని వల్ల ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు పంట సాగైందని అధికారులు చెప్తున్నారు. 99 మిలియన్ కేజీల ఉత్పత్తి అంచనా: పంట సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు పొగాకు ఉత్పత్తి కూడా పెరుగుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్డు 11 వేలం కేంద్రాల పరిధిలో 87 మిలియన్ కేజీల పొగాకును విక్రయించుకునేందుకు అనుమతించింది. కానీ అనుమతిని మించి 12 మిలియన్ కేజీలు అధికంగా అంటే 99 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని బోర్డు అధికారుల అంచనా. అలాగే ఈ ఏడాది క్యూరింగ్‌లో నాణ్యత కూడా పర్వాలేదని చెప్తున్నారు. 55–60 శాతం వరకు బ్రైట్ గ్రేడ్(గ్రేడ్–1) పొగాకు వస్తుందని, 25 శాతం మీడియం, మరో 25 శాతం లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఈ ఏడాది పొగాకు రైతులకు ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. -
ఏపీలో ఆశాజనకంగా పొగాకు సాగు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పొగాకు బోర్డు అంచనా వేసింది. ఈ ఏడాది పొగాకు బోర్డు రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 150 మిలియన్ కిలోలు దాటుతుందని భావిస్తోంది. గత ఏడాది కన్నా ఎక్కువ ఉత్పత్తికి అనుమతి మన దేశం నుంచి ప్రపంచంలోని 50 దేశాలకు పొగాకు ఎగుమతి అవుతోంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. గత ఏడాది 130 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతివ్వగా, 43వేల మంది రైతులు 66వేల హెక్టార్లలో 121 మిలియన్ కిలోలను పండించారు. ఈ ఏడాది పొగాకు బోర్డు 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించింది. డిసెంబర్లో మాండూస్ తుపాను వచ్చే నాటికి 53,500 హెక్టార్లలో పంట సాగు చేశారు. తుపాను కారణంగా 26,197 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. అందులో తొమ్మిది వేల హెక్టార్ల వరకు మళ్లీ పంట వేయాల్సి వచ్చింది. ఇంకా పలుచోట్ల పొగాకు నాట్లు కొనసాగుతున్నాయి. అందువల్ల గత ఏడాది కన్నా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాగు ఖర్చుల కోసం పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రైతులకు రూ.10వేలు చొప్పున ఇస్తున్నారు. ఈ ఏడాది అదనంగా రూ.50 వేలు రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు పొగాకు బోర్డు లేఖ రాసింది. కర్ణాటకలో తగ్గిన దిగుబడి.. ఏపీలో డిమాండ్ పెరిగే అవకాశం మన రాష్ట్రం కన్నా ముందుగా కర్ణాటకలో పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పొగాకు వేలం జరుగుతోంది. కర్ణాటకలో అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆ రాష్ట్రంలో వంద మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 66 మిలియన్ కిలోల వరకే వచ్చిందని అంచనా. ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల పంట మాత్రమే రైతులు విక్రయించారు. సంక్రాంతి తర్వాత పొగాకు అమ్మకాలు పుంజుకుంటాయని బోర్డు అంచనా వేస్తోంది. ఈ ఏడాది ధర కూడా గణనీయంగా వచ్చింది. అత్యధికంగా కిలోకు రూ.271లు ధర పలకగా, సగటున కిలోకు రూ.239.16లు వచ్చింది. కర్ణాటకలో దిగుబడి తగ్గడం, ధర బాగుండటంతో మన రాష్ట్రంలోని పంటకు డిమాండ్ వస్తుందని రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అందువల్లే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరులో గానీ మార్చి మొదటి వారంలో గానీ పొగాకు వేలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆశాజనకంగా ఉంది రాష్ట్రంలో పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. పొగాకుకు గత ఏడాది మంచి ధర ఉండటంతో ఈ సంవత్సరం ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. పొగాకు రైతులకు అన్ని విధాలుగా బోర్డు అండగా నిలుస్తోంది. గతంలో పొగాకు రైతులకు సగటున పది రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమయ్యేది. ఇప్పుడు ఎనిమిది రోజుల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు పడేలా ఏర్పాట్లుచేశాం. –అద్దంకి శ్రీధర్‌బాబు, టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
పొగాకు సాగులో జాగ్రత్తలు పాటించాలి
రీజినల్ మేనేజర్ రత్నసాగర్ మర్రిపాడు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొగాకు రైతులు సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని భారత పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ రత్నసాగర్ పేర్కొన్నారు. డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో డీసీపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో 3,992 మంది రైతులకు పొగాకు పండించేందుకు 3,180 బ్యారెన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను 7,683 హెక్టార్లలో నాట్లు వేసేందుకు బోర్డు అనుమతిని ఇచ్చిందని తెలిపారు. దాంట్లో 10.8 మిలియన్ కిలోల పొగాకు పండించాలని సూచించినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనీసం సగభాగం కూడా వేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 199 హెక్టార్లలో మాత్రమే పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు వేసిన 190 హెక్టార్లలో కూడా 60 హెక్టార్లలో మొక్కలన్ని మాడిపోయి చనిపోయాయని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 3130 హెక్టార్లలో పొగాకు నాట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు తడులు నీళ్లు కలిపి పొగాకు నాట్లు వేసినప్పటికీ దిగుబడి పెరిగే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. వేలం కేంద్రం పరిధిలో డీసీపల్లి, ఖాన్‌సాహెబ్‌పేట, బంట్లపల్లి, కోనసముద్రం, మర్రిపాడు గ్రామాల్లో తోటలను పరిశీలించారు. వారి వెంట క్షేత్రాధికారులు గిరిరాజ్‌కుమార్, బెనర్జీ, పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు బతుకు వేలం
♦ మందకొడిగా పొగాకు కొనుగోళ్లు ♦ ఐటీసీ కనుసన్నల్లోవ్యాపారులు సిండికేట్ ♦ నూరు వేలం రోజుల్లో కొన్నది 48 మిలియన్ కిలోలు ♦ కొనాల్సింది 69.30 మి.కి. రైతుల వద్దే మీడియం, లోగ్రేడ్ రకాలు ♦ లోబిడ్ పేరుతో తిప్పి పంపుతున్న వ్యాపారులు ♦ సగటు ధర కిలోకు రూ.116.. ఉత్పత్తి ఖర్చు రూ.135 ♦ మంత్రులు హామీ ఇచ్చినా గిట్టుబాటు ధర కరువు ♦ పొగాకు సాగుపై రైతుల విముఖత సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నూరు రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి చేస్తామని అటు టుబాకో బోర్డు, ఇటు వ్యాపారులు చెప్పిన మాటలు నీటమూటలుగా మారాయి. మంగళవారంతో వేలం పాటలు నిర్వహించిన రోజులు వంద పూర్తవుతున్నారుు. జిల్లా వ్యాప్తంగా 69.30 మిలియన్ కిలోలు పొగాకును కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 48 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే వ్యాపారులు కొన్నారు. ఇంకా 21.30 మిలియన్ కిలోల పొగాకును కొనాల్సి ఉంది. ప్రస్తుతం రైతుల వద్ద మీడియం, లోగ్రేడ్ రకాలు మాత్రమే ఉన్నాయి. వ్యాపారులు లోబిడ్, ఆర్ఆర్ పేర్లతో 20 శాతం పొగాకును కొనుగోలు చేయకుండా వెనక్కి తిప్పి పంపుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పొగాకును రైతులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే... సగటున కిలోకు రూ.116 ధర మాత్రమే వచ్చింది. మిగిలిన మీడియం, లోగ్రేడ్ అమ్మకాలు పూర్తయితే సగటున కిలోకు రూ.100 మించి రేటు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం కిలో పొగాకు ఉత్పత్తికి రూ.130 నుంచి రూ.140 ఖర్చు వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కిలోకు రూ.30 నుంచి రూ.40 నష్టపోవాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్క బ్యారన్‌కు దాదాపు రూ.2 లక్షలు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పొగాకు సాగు.. జిల్లావ్యాప్తంగా 21,226 బ్యారన్ల పరిధిలో 26,468 మంది రైతులు 42,618 హెక్టార్లలో పొగాకును పండించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి పడిపోవడంతో ఇక్కడ పండించే పొగాకుకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు భావించారు. డిమాండ్ సప్లై ప్రకారం ధరలుంటాయని గతేడాది కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది. ఈ ఏడాది మన రాష్ట్రంతో పాటు అటు కర్ణాటక ప్రాంతంలోనూ పొగాకు ఉత్పత్తి పడిపోయింది. దీంతో పొగాకుకు మంచి ధరలు లభిస్తాయని రైతులు ఆశించారు. ఐటీసీ కనుసన్నల్లో దోపిడీ.. ఐటీసీ కనుసన్నల్లో పని చేస్తున్న పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి పొగాకు కొనుగోళ్లకు దిగారు. పైగా నోబిడ్, ఆర్ఆర్ పేర్లతో రైతుల వద్దనున్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టుబాకో బోర్డు ఈ మాత్రం పట్టించుకోలేదు. మంత్రుల మాటలు నీటిమూటలు.. రైతులకు న్యాయం చేస్తామని పలుమార్లు చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల హామీలు నీటిమూటలుగా మారాయి. వారు హామీ ఇచ్చిన తర్వాత కిలోకు రూ.15 నుంచి రూ.10 తగ్గించి మరీ వ్యాపారులు కొనుగోలు చేయడం గమనార్హం. నిర్మలాసీతారామన్ ఒత్తిడితో గోదావరి జిల్లాల్లో వ్యాపారులు ఒంగోలుతో పోలిస్తే రైతులకు అధిక ధరలిచ్చి కొనుగోలు చేశారు. ఇక్కడ మాత్రం సగటున రూ.116కు మించి విలువ లేదు. నత్తనడకన కొనుగోళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు కొనుగోళ్లను పరిశీలిస్తే... 120 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 76 మిలియన్ కిలోలు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇంకా 46 మిలియన్ కిలోలు పొగాకును కొనుగోలు చేయాల్సి ఉంది. సగటున రూ.123 ధర వచ్చింది. వేలం మొదలైనప్పుడు వంద వేలం రోజుల్లో మొత్తం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్న వ్యాపారులు కొనుగోళ్లు పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా దాదాపు 50 మిలియన్ కిలోల పొగాకును కొనాల్సి ఉంది. ఇతర పంటల సాగుపై మొగ్గు.. అటు ప్రభుత్వం, ఇటు టుబాకో బోర్డు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, డిమాండ్ ఉన్నా... గిట్టుబాటు ధర లభించకపోవడంతో పొగాకు రైతులు పొగాకు ఉత్పత్తిపై విముఖత పెంచుకుంటున్నారు. దీంతో వచ్చే ఏడాది పొగాకు సాగు మరింత తగ్గే అవకాశం ఉంది. రైతులు పొగాకు సాగు మానుకొని ఇతర పంటల వైపు మొగ్గు చూపనున్నారు. పొగాకు రైతులు అన్యాయం జరుగుతున్నా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల్ని వంచించడం అన్యాయం.. టుబాకోబోర్డు అనుమతినిచ్చిన మేరకే పొగాకు ఉత్పత్తి చేసిన వ్యాపారులు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను వంచించటం అన్యాయమని రైతు నాయకుడు దుగ్గినేని గోపీనాథ్ విమర్శించారు. మరోవైపు అటు ప్రభుత్వం, ఇటు టుబాకో బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బ్యారన్‌కు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు నష్టపోయి రైతులు మరోమారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల వద్దనున్న పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
పొగాకు రైతుల కోసం ఆత్మత్యాగం
దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు రైతుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాడు... పొగాకు రైతుల కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో స్పష్టంచేశాడు... పరిష్కారమార్గం కూడా చూపించాడు... అయినా ప్రభుత్వాధినేత స్పందించకపోవడంతో అన్నంతపనీ చేశాడు... కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఉసురు తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన సింహాద్రి వెంకటేశ్వరరావు అనే రైతు (55) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పొగాకు రైతుల దుస్థితిపై వెంకటేశ్వరరావు వారం రోజుల కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పొగాకు రైతుల్ని ఆదుకోవాలని కోరారు. వారి కోసం తాను ఆత్మత్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. లేఖను ఈనెల 16న సీఎంకు పంపించారు. బ్యాంకు అప్పులు తీర్చలేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తన ప్రాణరక్షణ కోసం సుమారు రూ.5.50 కోట్లు వెచ్చించి బస్సు తయారు చేయించుకున్నప్పుడు... పొగాకు రైతుల ప్రాణ రక్షణకు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బ్యారన్‌కు రూ.9 లక్షల చొప్పున కేంద్రం పరిహారం ఇస్తే రైతులు స్వచ్ఛందంగా పొగాకు బ్యారన్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుని లెసైన్సులను ప్రభుత్వానికి అప్పగిస్తారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రినుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాలు మింగేసిన అప్పుల భారం పొగాకు సాగు గిట్టుబాటు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో వెంకటేశ్వరరావు తనకున్న 11 ఎకరాల పొలాన్ని రెండేళ్ల కిందట అమ్మేశాడు. అయినా అప్పులు తీరక 22 ఎకరాలను దేవస్థానం భూమిని కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తున్నాడు. పంటకు రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ ఏడాది పొగాకుకు గిట్టుబాటు లభించకపోవడంతో బ్యాంకు అప్పులు తీరలేదు.సుమారు రూ.34 లక్షల మేర అప్పులు ఉన్నాయి. అది తీర్చే దారిలేక వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కొత్తవారికి నో ఛాన్స్..!
ఒంగోలు టూటౌన్ : పొగాకు సాగు చేసే రైతుల రిజిస్ట్రేషన్లకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. పాతవారికే ఛాన్స్ ఇస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు గాను బోర్డు కొన్ని నిబంధనలు విధించింది. 2014-15 సంవత్సరంలో పంటకాలంలో ఉత్పత్తిదారులుగా నమోదు చేసుకొని, పొగాకు పంటకు అనువైన నేలలు, పక్కా లెసైన్స్ బ్యారన్ కలిగి ఉన్న రైతులందరూ, షరతులకు లోబడిన రైతులకే 2015-16 సంవత్సరంలో రెన్యువల్‌కు అర్హులని తేల్చింది. ఇక ఈ ఏడాది కొత్త బ్యారన్లకు అనుమతించరు. కొత్తగా పొగాకు సాగు చేసే రైతులకు రిజిస్ట్రేషన్లు మంజూరు చేయరు. ఇంకా కొత్త ప్రాంతాల్లో పొగాకు సాగుకు అనుమతించరు. ఇక నుంచి పొగాకు బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందకుండా పొగాకు పండించడం, లెసైన్స్ లేకుండా బ్యారన్ కట్టి పొగాకు క్యూరింగ్ చేయడం, వేలం కేంద్రాల వెలుపల పొగాకు అమ్మకాలు, కొనుగోళ్లు చేయుట వంటి చర్యలు పొగాకు బోర్డు చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. మొత్తం ఈ ఏడాది పంట సాగు 120 మిలియన్ కిలోలకే పరిమితం చేసింది. గత ఏడాది కంటే 52 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తిని తగ్గించింది. పది ఎకరాల సాగు నుంచి ఆరు ఎకరాల సాగుకు ఒక రైతుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఉత్తర ప్రాంత తేలిక నేలలు(ఎన్ఎల్ఎస్) 35 మిలియన్ కిలోలు, దక్షిణ ప్రాంత తేలిక నేలల 45 మిలియన్ కిలోల పంట పరిమాణానికి అనుమతి ఇచ్చింది. రిజిస్ట్రేషన్లకు వచ్చే నెల 18 తుది గడువు విధించింది. రూ.100 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 25 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని పేర్కొంది. ఇంకా రూ.400 అపరాధ రుసుంతో దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1 వరకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో మొత్తం 22 వేల బ్యారన్లు ఉన్నాయి. ఒంగోలు 1,2, టంగుటూరు 1, 2, కొండపి, కందుకూరు 1,2, వెల్లంపల్లి 1,2, పొదిలి 1,2, నెల్లూరు జిల్లాలో కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో పొగాకు పండించే రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.