రైతు బతుకు వేలం | Averse farmers in the cultivation of tobacco | Sakshi
Sakshi News home page

రైతు బతుకు వేలం

Published Tue, Jun 28 2016 8:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Averse farmers in the cultivation of tobacco

మందకొడిగా పొగాకు కొనుగోళ్లు
ఐటీసీ కనుసన్నల్లోవ్యాపారులు సిండికేట్
నూరు వేలం రోజుల్లో కొన్నది 48 మిలియన్ కిలోలు
కొనాల్సింది 69.30 మి.కి.  రైతుల వద్దే మీడియం, లోగ్రేడ్ రకాలు
లోబిడ్ పేరుతో తిప్పి పంపుతున్న వ్యాపారులు
సగటు ధర కిలోకు రూ.116.. ఉత్పత్తి ఖర్చు రూ.135
మంత్రులు హామీ ఇచ్చినా గిట్టుబాటు ధర కరువు
పొగాకు సాగుపై రైతుల విముఖత

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నూరు రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి చేస్తామని అటు టుబాకో బోర్డు, ఇటు వ్యాపారులు చెప్పిన మాటలు నీటమూటలుగా మారాయి. మంగళవారంతో వేలం పాటలు నిర్వహించిన రోజులు వంద పూర్తవుతున్నారుు. జిల్లా వ్యాప్తంగా 69.30 మిలియన్ కిలోలు పొగాకును కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 48 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే వ్యాపారులు కొన్నారు. ఇంకా 21.30 మిలియన్ కిలోల పొగాకును కొనాల్సి ఉంది. ప్రస్తుతం రైతుల వద్ద మీడియం, లోగ్రేడ్ రకాలు మాత్రమే ఉన్నాయి. వ్యాపారులు  లోబిడ్, ఆర్‌ఆర్ పేర్లతో 20 శాతం పొగాకును కొనుగోలు చేయకుండా వెనక్కి తిప్పి పంపుతున్నారు.

దీంతో పూర్తిస్థాయిలో పొగాకును రైతులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే... సగటున కిలోకు రూ.116 ధర మాత్రమే వచ్చింది. మిగిలిన మీడియం, లోగ్రేడ్ అమ్మకాలు పూర్తయితే సగటున కిలోకు రూ.100 మించి రేటు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం కిలో పొగాకు ఉత్పత్తికి రూ.130 నుంచి రూ.140 ఖర్చు వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క కిలోకు రూ.30 నుంచి రూ.40 నష్టపోవాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక్క బ్యారన్‌కు దాదాపు రూ.2 లక్షలు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.

జిల్లాలో పొగాకు సాగు..
జిల్లావ్యాప్తంగా 21,226 బ్యారన్ల పరిధిలో 26,468 మంది రైతులు 42,618 హెక్టార్లలో పొగాకును పండించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి పడిపోవడంతో ఇక్కడ పండించే పొగాకుకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు భావించారు. డిమాండ్ సప్లై ప్రకారం ధరలుంటాయని గతేడాది కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది. ఈ ఏడాది మన రాష్ట్రంతో పాటు అటు కర్ణాటక ప్రాంతంలోనూ పొగాకు ఉత్పత్తి పడిపోయింది. దీంతో పొగాకుకు మంచి ధరలు లభిస్తాయని రైతులు ఆశించారు.

ఐటీసీ కనుసన్నల్లో దోపిడీ..
ఐటీసీ కనుసన్నల్లో పని చేస్తున్న పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి పొగాకు కొనుగోళ్లకు దిగారు. పైగా నోబిడ్, ఆర్‌ఆర్ పేర్లతో రైతుల వద్దనున్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టుబాకో బోర్డు ఈ మాత్రం పట్టించుకోలేదు.

మంత్రుల మాటలు నీటిమూటలు..
రైతులకు న్యాయం చేస్తామని పలుమార్లు చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల హామీలు నీటిమూటలుగా మారాయి. వారు హామీ ఇచ్చిన తర్వాత కిలోకు రూ.15 నుంచి రూ.10 తగ్గించి మరీ వ్యాపారులు కొనుగోలు చేయడం గమనార్హం. నిర్మలాసీతారామన్ ఒత్తిడితో గోదావరి జిల్లాల్లో వ్యాపారులు ఒంగోలుతో పోలిస్తే రైతులకు అధిక ధరలిచ్చి కొనుగోలు చేశారు. ఇక్కడ మాత్రం సగటున రూ.116కు మించి విలువ లేదు.

నత్తనడకన కొనుగోళ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు కొనుగోళ్లను పరిశీలిస్తే... 120 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 76 మిలియన్ కిలోలు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇంకా 46 మిలియన్ కిలోలు పొగాకును కొనుగోలు చేయాల్సి ఉంది. సగటున రూ.123 ధర వచ్చింది. వేలం మొదలైనప్పుడు వంద వేలం రోజుల్లో మొత్తం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్న వ్యాపారులు కొనుగోళ్లు పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా దాదాపు 50 మిలియన్ కిలోల పొగాకును కొనాల్సి ఉంది.

ఇతర పంటల సాగుపై మొగ్గు..
అటు ప్రభుత్వం, ఇటు టుబాకో బోర్డు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, డిమాండ్ ఉన్నా... గిట్టుబాటు ధర లభించకపోవడంతో పొగాకు రైతులు పొగాకు ఉత్పత్తిపై విముఖత పెంచుకుంటున్నారు. దీంతో వచ్చే ఏడాది పొగాకు సాగు మరింత తగ్గే అవకాశం ఉంది. రైతులు పొగాకు సాగు మానుకొని ఇతర పంటల వైపు మొగ్గు చూపనున్నారు. పొగాకు రైతులు అన్యాయం జరుగుతున్నా... జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతుల్ని వంచించడం అన్యాయం..
టుబాకోబోర్డు అనుమతినిచ్చిన మేరకే పొగాకు ఉత్పత్తి చేసిన వ్యాపారులు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను వంచించటం అన్యాయమని రైతు నాయకుడు దుగ్గినేని గోపీనాథ్ విమర్శించారు. మరోవైపు అటు ప్రభుత్వం, ఇటు టుబాకో బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బ్యారన్‌కు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు నష్టపోయి రైతులు మరోమారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల వద్దనున్న పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement