కొత్తవారికి నో ఛాన్స్..!
ఒంగోలు టూటౌన్ : పొగాకు సాగు చేసే రైతుల రిజిస్ట్రేషన్లకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. పాతవారికే ఛాన్స్ ఇస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు గాను బోర్డు కొన్ని నిబంధనలు విధించింది. 2014-15 సంవత్సరంలో పంటకాలంలో ఉత్పత్తిదారులుగా నమోదు చేసుకొని, పొగాకు పంటకు అనువైన నేలలు, పక్కా లెసైన్స్ బ్యారన్ కలిగి ఉన్న రైతులందరూ, షరతులకు లోబడిన రైతులకే 2015-16 సంవత్సరంలో రెన్యువల్‌కు అర్హులని తేల్చింది. ఇక ఈ ఏడాది కొత్త బ్యారన్‌లకు అనుమతించరు. కొత్తగా పొగాకు సాగు చేసే రైతులకు రిజిస్ట్రేషన్‌లు మంజూరు చేయరు.
ఇంకా కొత్త ప్రాంతాల్లో పొగాకు సాగుకు అనుమతించరు. ఇక నుంచి పొగాకు బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందకుండా పొగాకు పండించడం, లెసైన్స్ లేకుండా బ్యారన్ కట్టి పొగాకు క్యూరింగ్ చేయడం, వేలం కేంద్రాల వెలుపల పొగాకు అమ్మకాలు, కొనుగోళ్లు చేయుట వంటి చర్యలు పొగాకు బోర్డు చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. మొత్తం ఈ ఏడాది పంట సాగు 120 మిలియన్ కిలోలకే పరిమితం చేసింది. గత ఏడాది కంటే 52 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తిని తగ్గించింది. పది ఎకరాల సాగు నుంచి ఆరు ఎకరాల సాగుకు ఒక రైతుకు అనుమతి ఇచ్చింది.
జిల్లాలో ఉత్తర ప్రాంత తేలిక నేలలు(ఎన్‌ఎల్‌ఎస్) 35 మిలియన్ కిలోలు, దక్షిణ ప్రాంత తేలిక నేలల 45 మిలియన్ కిలోల పంట పరిమాణానికి అనుమతి ఇచ్చింది. రిజిస్ట్రేషన్లకు వచ్చే నెల 18 తుది గడువు విధించింది. రూ.100 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 25 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని పేర్కొంది. ఇంకా రూ.400 అపరాధ రుసుంతో దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1 వరకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో మొత్తం 22 వేల బ్యారన్లు ఉన్నాయి. ఒంగోలు 1,2, టంగుటూరు 1, 2, కొండపి, కందుకూరు 1,2, వెల్లంపల్లి 1,2, పొదిలి 1,2, నెల్లూరు జిల్లాలో కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో పొగాకు పండించే రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.