రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఒకవైపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి.. మరోవైపు ల్యాండ్ పూలింగ్ బూచిని చూపిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంటే ఇన్నాళ్లూ లోలోన కుమిలిపోతున్న రైతులంతా ఉప్పెనలా ఎగిసి ఉద్యమానికి సిద్ధమయ్యారు. వీరికి తోడునీడగా వైఎస్సార్ సీపీ నిలవడంతో ఆందోళన పర్వంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఏలికల బెదిరింపులు.. అధికారుల అదిలింపులకు ఇక వెరిసేది లేదన్నారు.
ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని, తమకు అండగా నిలిచిన పార్టీతో కలిసి సర్కారుపై పోరు కొనసాగిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాజధాని ప్రాంతానికి పెద్దఎత్తున తరలివచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులకు సంబంధిత గ్రామాల ప్రజలు పూలజల్లుతో స్వాగతం పలికారు.
- గుంటూరు/విజయవాడ
రైతులను అడ్డుకున్న పోలీసులు
తుళ్లూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాజధాని రైతు పరిరక్షణ కమిటీ శాసన సభపక్ష ఎమ్మెల్యేల పర్యటనలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపారు. భూసమీకరణకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాల రైతులను అడ్డుకున్నారు. గుంటూరులో నివాసం ఉంటున్న కొందరు రైతులు తమ గ్రామాలకు వస్తుంటే దారిలో వారిని పోలీసులు నిలువరించారు. రాయపూడి గ్రామానికి మల్లెల శేషగిరిరావు అనే రైతు గుంటూరు నుంచి తమ గ్రామానికి వెళుతుండగా ఓ పోలీసు అధికారి మీరు వెళ్లటానికి వీల్లేదని అడ్డుపడినట్లు చెప్పారు. ఇలా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు పలువురు రైతులు వాపోయారు.
- తాడికొండ
అన్నదాతకు అభయం
Published Tue, Feb 24 2015 1:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement