సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పొగాకు బోర్డు అంచనా వేసింది. ఈ ఏడాది పొగాకు బోర్డు రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 150 మిలియన్ కిలోలు దాటుతుందని భావిస్తోంది.
గత ఏడాది కన్నా ఎక్కువ ఉత్పత్తికి అనుమతి
మన దేశం నుంచి ప్రపంచంలోని 50 దేశాలకు పొగాకు ఎగుమతి అవుతోంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. గత ఏడాది 130 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతివ్వగా, 43వేల మంది రైతులు 66వేల హెక్టార్లలో 121 మిలియన్ కిలోలను పండించారు. ఈ ఏడాది పొగాకు బోర్డు 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించింది. డిసెంబర్‌లో మాండూస్ తుపాను వచ్చే నాటికి 53,500 హెక్టార్లలో పంట సాగు చేశారు. తుపాను కారణంగా 26,197 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. అందులో తొమ్మిది వేల హెక్టార్ల వరకు మళ్లీ పంట వేయాల్సి వచ్చింది. ఇంకా పలుచోట్ల పొగాకు నాట్లు కొనసాగుతున్నాయి. అందువల్ల గత ఏడాది కన్నా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాగు ఖర్చుల కోసం పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రైతులకు రూ.10వేలు చొప్పున ఇస్తున్నారు. ఈ ఏడాది అదనంగా రూ.50 వేలు రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు పొగాకు బోర్డు లేఖ రాసింది.
కర్ణాటకలో తగ్గిన దిగుబడి.. ఏపీలో డిమాండ్ పెరిగే అవకాశం
మన రాష్ట్రం కన్నా ముందుగా కర్ణాటకలో పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పొగాకు వేలం జరుగుతోంది. కర్ణాటకలో అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆ రాష్ట్రంలో వంద మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 66 మిలియన్ కిలోల వరకే వచ్చిందని అంచనా. ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల పంట మాత్రమే రైతులు విక్రయించారు. సంక్రాంతి తర్వాత పొగాకు అమ్మకాలు పుంజుకుంటాయని బోర్డు అంచనా వేస్తోంది. ఈ ఏడాది ధర కూడా గణనీయంగా వచ్చింది. అత్యధికంగా కిలోకు రూ.271లు ధర పలకగా, సగటున కిలోకు రూ.239.16లు వచ్చింది. కర్ణాటకలో దిగుబడి తగ్గడం, ధర బాగుండటంతో మన రాష్ట్రంలోని పంటకు డిమాండ్ వస్తుందని రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అందువల్లే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరులో గానీ మార్చి మొదటి వారంలో గానీ పొగాకు వేలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఆశాజనకంగా ఉంది
రాష్ట్రంలో పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. పొగాకుకు గత ఏడాది మంచి ధర ఉండటంతో ఈ సంవత్సరం ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. పొగాకు రైతులకు అన్ని విధాలుగా బోర్డు అండగా నిలుస్తోంది. గతంలో పొగాకు రైతులకు సగటున పది రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమయ్యేది. ఇప్పుడు ఎనిమిది రోజుల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు పడేలా ఏర్పాట్లుచేశాం.
–అద్దంకి శ్రీధర్‌బాబు, టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment