
సాక్షి, అమరావతి: సంక్షోభంలో ఉన్న పొగాకు రైతుల్ని ఆదుకుని తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్జీనియా పొగాకుకు ధర లేక, అష్టకష్టాలు పడుతూ వేలం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. పొగాకు ధరల సంక్షోభంపై సీఎం సోమవారం వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు, సీఎం కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, పొగాకు బోర్డు, వ్యవసాయాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు తాను ఇటీవల ఈ వ్యవహారంపై గుంటూరులో పొగాకు బోర్డు అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, బయ్యర్లతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు.
మంత్రి సమీక్ష అనంతరం నాణ్యత లేదన్న సాకుతో పొగాకును తిరస్కరించే శాతం తగ్గిందని, ధర కూడా స్వల్పంగా పెరిగిందని పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు వివరించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతుకు న్యాయం చేసేలా ధర పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. పొగాకును కొనుగోలు చేసే ఐటీసీ వంటి పెద్ద కంపెనీల ప్రతినిధులు, ఇతర బయ్యర్లతో తానే స్వయంగా త్వరలో మాట్లాడతానని, ఆ మేరకు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేయాల్సింది పొగాకు కంపెనీలే కాబట్టి ఆ మేరకు వారితోనే చర్చలు జరిపితే సత్ఫలితాలు వస్తాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment