కాకినాడ: వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, అన్నదాత సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తారా... అంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవలి అకాల వర్షాలను సాకుగా తీసుకుని రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు ఆ ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ నిబంధనలను సడలించి మరీ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ ద్వారా ఖరీఫ్‌లో 6.40 లక్షల రైతుల నుంచి 35,41,564 టన్నుల ధాన్యం కొన్నారని తెలిపారు. సుమారు రూ.7,233 కోట్లలో రూ.7,212 కోట్లు.. అంటే 99 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో రూ.1,629 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ.1,277 కోట్ల చెల్లింపులు కూడా చేశారన్నారు.
21 రోజుల్లో చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆరు రోజులకే చెల్లించారన్నారు. ఎఫ్‌సీఐ బొండాలు ధాన్యాన్ని కొంతకాలంగా కొనడంలేదని, అయితే ఈసారి అధిక విస్తీర్ణంలో ఈ రకం పండించడంతో ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వాటినీ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 17 శాతంకన్నా తేమ అధికంగా ఉంటే రైతులు నష్టపోకూడదని నిబంధనలు సడలించారన్నారు. తడిసిన ధాన్యం కళ్లాల్లో ఉండడం వల్ల ఆఫ్‌లైన్‌లో సైతం ప్రొక్యూర్‌మెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ విపక్ష నేతలకు కనిపించలేదా.. అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment