పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఉమ్మారెడ్డి
హైదరాబాద్ : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫమలైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గతేడాది పొగాకు కిలోకు రూ.174 ఉంటే ఈ ఏడాది రూ.110-117 ఉందని ఆయన అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పొగాకు రైతులను పరామర్శించి, గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన మండిపడ్డారు.
ఈ నెల 14న పొగాకు అమ్మే అన్ని ఫ్లాట్ ఫాంల దగ్గర వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపడుతుందని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామన్నారు. పొగాకు పంటకు మద్దతు ధర లేక టంగుటూరులో కొండల్రావు అనే రైతు గుండెపోటుతో మరణించాడని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొగాకు కిలోకు రూ.150కు పెంచాలని డిమాండ్ చేశారు.