పొగాకు సక్రమంగా కొనటంలేదని రోడ్డెక్కిన రైతులు
సాక్షి, కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు వేలానికి ఉంచిన బేళ్లలో ప్రతిరోజు వంద నుంచి 200 పొగాకు బేళ్లు కొనకుండా వ్యాపారులు వెనక్కి తిప్పి పంపుతుండటంతో కడుపు మండిన రైతులు ఆర్‌అండ్‌బీ రోడ్డు ఎక్కి ధర్నా చేసిన సంఘటన కొండపిలో జరిగింది. కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం వేలంకేంద్రం పరిధిలోని అయ్యవారిపాలెం, జువ్విగుంట, తంగెళ్ళ గ్రామాల నుంచి రైతులు 1047 బేళ్లను అమ్మకాలకు పెట్టారు. వేలం కేంద్రం అధికారి మధుసూదనరావు వేలాన్ని ప్రారంభించగా 74 బేళ్లు బిడ్డింగ్ కాగా అందులో 35 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో కొనకుండా తిరస్కరించారు.
దీంతో పరిస్థితి గమనించిన రైతులు ఒక్కసారిగా వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వేలం జరిగిన బేళ్లలో సగం బేల్స్‌ను కొనకుండా తిరస్కరిస్తే ఇక రైతులు అమ్ముకునేది ఏంటని వ్యాపారులను నిలదీసి వేలాన్ని అడ్డుకుని నిలిపివేశారు. అనంతరం వందల మంది రైతులు బోర్డు ముందు ఆర్‌అండ్‌బీ రోడ్డు మీద బైఠాయించి అర్ధగంటకు పైగా తమ నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని రైతులను కోరటంతో కొద్దిసేపు ధర్నా చేసి విరమిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోర్డు ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు వందల సంఖ్యలో పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేయకపోవటం వలన తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు ఆవేదన చెందారు. ధరలు దిగ్గోసి కొంటున్నా వచ్చినదే దక్కుదల అని అమ్ముకుని నష్ట పోతున్నారన్నారు. పొగాకు బాగోలేదని, ఆర్డర్‌లు లేవని రకరకాల సాకులతో తెచ్చిన బేళ్లను సైతం కొనకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల సంఖ్యలో తెచ్చిన బేళ్లను రైతులు ఇళ్లకు తీసుకెళ్లి తీసుకురావాలంటే రవాణా ఖర్చులు సైతం తడిసిమోపెడవుతున్నాయని తెలిపారు. ఇక మీదట రైతులు పొగాకు వేసే పరిస్థితి సైతం లేదన్నారు. బోర్డు తగిన చర్యలు తీసుకుని తెచ్చిన బేళ్లను వెనక్కి పంపకుండా వ్యాపారులతో కొనిపించాలన్నారు. కార్యక్రమంలో పొగాకు రైతులు పాల్గొన్నారు.
వ్యాపారులు నోబిడ్‌లు లేకుండా చూడాలి
వ్యాపారులు ప్రతి రోజు వందకు పైగా బేళ్లను కొనకుండా వెనక్కి పంపుతున్నారు. ఈవిధంగా కొంటే రైతులు పొగాకు అమ్ముకోలేరు. 74 బేళ్లకు పాట పెడితే 34 బేళ్లను నోబిడ్ పెట్టాల్సి వచ్చింది. ఈవిధంగా అయితే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వెనక్కి తీసుకెళ్లి తీసుకురావటంతోనే కాలం సరిపోతుంది. వ్యాపారులు నోబిడ్‌లు తగ్గించి కొనుగోలు చేయాలి.
- కె.మధుసూదనరావు, వేలంకేంద్రం అధికారి, కొండపి
చాలా ఘోరంగా ఉంది
కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు పరిస్థితి ఘోరంగా ఉంది. గిట్టుబాటు ధరల గురించి ఆశలు వదులుకున్న రైతులు ఏదో ఒక రేటుకు పొగాకు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నా వ్యాపారులు కొనటం లేదు. ప్రతిరోజు వందల సంఖ్యలో రైతులు తెచ్చిన బేళ్లను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి గురించి బోర్డు పట్టించుకుని చర్యలు తీసుకోవాలి.
- ఎల్.భాస్కర్, అయ్యవారిపాలెం, పొగాకు రైతు
పొగాకు రైతుల పరిస్థితి దీనంగా ఉంది
నీరులేక, మల్లె పెరిగి దిగుబడి రాక అష్టకష్టాలు పడి పండించిన పంటను వ్యాపారులు దోచుకుంటున్నారు. దోపిడీకి మేము సహించి బేళ్లు వదులుకుంటున్నా వివిధ సాకులతో తెచ్చిన బేళ్లను కొనకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. పొగాకు రైతుల బాధలు ఎవరూ పట్టించుకోవటం లేదు.
- బొట్లగుంట రమణయ్య, జువ్విగుంట
Comments
Please login to add a commentAdd a comment