సాక్షి, అమరావతి: పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు ఈ పంట సాగుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత సీజన్ (2021–22)లో అంతర్జాతీయంగా పొగాకు పండించే దేశాల్లో దిగుబడి గణనీయంగా తగ్గడంతో దేశీయంగా పొగాకుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంగా తొలిసారి బ్రైట్ గ్రేడ్‌తో సమానంగా మీడియం, లో గ్రేడ్ పొగాకు ధర పలికింది. (పొగాకును బ్రైట్, మీడియం, లోగ్రేడ్‌గా వర్గీకరించి విక్రయిస్తారు. బ్రైట్ పొగాకుకు మంచి రేటు వస్తుంది. మీడియం, లో గ్రేడ్ పొగాకుకు డిమాండ్‌ను బట్టి రేటు ఉంటుంది). 2020–21 సీజన్‌లో కిలోకు గరిష్టంగా రూ.193 పలుకగా, 2021–22లో రూ.245 పలికింది. అన్ని గ్రేడ్ల సరాసరి ధర 2020–21లో కిలో రూ.147.30 చొప్పున రాగా, 2021–22లో రూ.178.53 వచ్చింది.
2020–21 సీజన్‌లో రూ.1,661 కోట్ల టర్నోవర్ జరగ్గా, 2021–22 సీజన్‌లో ఇప్పటి వరకు రూ.2,061 కోట్ల వ్యాపారం జరిగింది. రాష్ట్రంలో పొగాకు సాధారణ సాగు విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ప్రకాశం, పశ్చిమగోదావరి, నెల్లూరు, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగవుతుంది. ప్రస్తుత సీజన్‌లో 130 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 115 మిలియన్ కిలోలు మార్కెట్‌కు వచ్చింది. మరో 10 మిలియన్ కిలోల వరకు వచ్చే అవకాశం ఉంది. 2022–23 సీజన్‌లో 142 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని పొగాకు బోర్డు నిర్దేశించింది.
మంచి రేటొచ్చింది
85 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నా. ఎకరాకు ఏడు క్వింటాళ్లు వచ్చింది. 6 క్వింటాళ్లు బ్రైట్, మీడియం గ్రేడ్ పొగాకు రాగా, మరో క్వింటాల్ లో గ్రేడ్ వచ్చింది. సరాసరి ధర కిలో రూ.177 పలికింది. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు.
– గుండ్రాళ్ల కొండారెడ్డి, సింగరబొట్లపాలెం, ప్రకాశం జిల్లా
సాగుపై ఆసక్తి పెరుగుతోంది
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సరాసరి ధర పలకడంతో రైతులు పొగాకు సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. 2022–23లో పొగాకు ఉత్పత్తి లక్ష్యం 142 మిలియన్ కిలోలుగా నిర్దేశించాం. సాగుదారులకు బోర్డు అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఈ ఏడాది అదనంగా సాగుకు అనుమతినిచ్చాం. రాయితీపై నాణ్యమైన విత్తనం, ఎరువులందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
– కృష్ణశ్రీ, ప్రొడక్షన్ మేనేజర్, పొగాకు బోర్డు
Comments
Please login to add a commentAdd a comment