రేపు బ్యాంకులు బంద్
ఉద్యోగుల ఒకరోజు సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఒక రోజు సమ్మె తలపెట్టినందున ప్రభుత్వరంగ బ్యాంకు సేవలకు రేపు(ఆగస్టు 22న) అంతరాయం కలగనుంది. బ్యాంకుల స్థిరీకరణతోపాటు పలు ఇతర అంశాలకు సంబంధించి సమ్మె చేయనున్నట్టు తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘమైన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్’ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో సేవల అంతరాయంపై చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇప్పటికే సమాచారం అందించాయి.
ఇక ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్, కోటక్ బ్యాంకు సేవలు సాధారణంగానే కొనసాగనున్నాయి. చీఫ్ లేబర్ కమిషనర్ ముందు చర్చలు విఫలమయ్యాయని, సమ్మె మినహా మరో మార్గం లేదని ఆల్‌ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీవోసీ) జనరల్ సెక్రటరీ డీటీ ఫ్రాంకో పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో వేటికీ ఇంతదాకా ఫలితం కనిపించలేదని, దీంతో ఈ నెల 22న సమ్మెకు సిద్ధమైనట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) తెలిపింది.
బ్యాంకుల స్థిరీకరణతోపాటు సంఘాలు లేవనెత్తిన ఇతర అంశాల్లో కార్పొరేట్ రుణాల ఎన్‌పీఏలను రద్దు చేయకుండా ఉండడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్‌పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయడం ఉన్నాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.