మూతపడ్డ బ్యాంకులు
విశాఖపట్నం: బ్యాంకులు మూతపడ్డాయి. వేతన సంబంధ అంశాలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేయడంతో వందల కోట్ల లావాదేవీలకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 750 బ్రాంచ్‌లుండగా వాటి పరిధిలో 1,112 ఏటీఎంలు పని చేస్తున్నాయి. బ్యాంకులు మూతపడడంతో మంగళవారం ఏటీఎంల వద్ద రద్దీ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులు పడినట్టుగా అంచనా. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా చెక్ క్లియరెన్సుల విషయంలో కొంతమేర ఇబ్బంది తప్పలేదు.
భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో నగదు లేక చాలా ఏటీఎం వద్ద మళ్లీ నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె విషయంపై అవగాహన లేని వందలాది మంది ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లగా..అక్కడ సమ్మె కారణంగా మూతపడినట్టుగా బోర్డులు దర్శనమివ్వడంతో నిరుత్సాహంతో వెనుదిరగడం కన్పించింది.