సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం | Resolve the problems | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం

Published Wed, Dec 31 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

Resolve the problems

ఒంగోలు: సమస్యల పరిష్కారం కోరుతూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి వద్ద లంచ్ అవర్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ వి.పార్థసారథి మాట్లాడుతూ పదో వేతన సవరణ ఒప్పందంపై ఇటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, అటు కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఏ బ్యాంకు ఉద్యోగి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలులో బ్యాంకు ఉద్యోగులు అధిక శ్రద్ధ చూపుతున్నా ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపి కూడా బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెనుకంజ వేయడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఒప్పందం చేసుకున్నా యాజమాన్యాలు  11 శాతం మాత్రమే వేతన సవరణ చేస్తామనడం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటమేనన్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మొత్తం ఒకరోజు సమ్మె చేయడంతో పాటు దేశంలోని నాలుగు విభాగాల్లో ఒక్కో రోజు నిరసన తెలియజేశామన్నారు. అయినా యాజమాన్యాలు స్పందించకపోతుండటంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా తాము కూడా 2015 జనవరి 7వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొనాలని నిర్ణయించామన్నారు.

అప్పటికీ స్పందించకపోతే జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జనవరి 25, 26 తేదీలు కూడా సెలవు రోజులని, అందు వల్ల ఆరు రోజుల పాటు పూర్తిస్థాయిలో బ్యాంకులు మూసేసేందుకు ఉద్యోగులు సంసిద్ధత ప్రకటించారన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోతే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తారని అన్నారు.

ఆందోళన కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు  వి.రామచంద్రయ్య, ఏ.వేణుగోపాల్, ఎం.నరేంద్రబాబు, కె.రవిప్రకాష్, ఆర్.చలపతిరావు, వంశీకృష్ణ, పీవీ కృష్ణారెడ్డి, ఎన్‌సీబీఈ నాయకులు ఎం.కృష్ణ, కృష్ణమోహన్, విజయమోహన్, ఏఐబీవోఏ నాయకులు డి.కోటేశ్వరరావు, సుధాకర్, ఏఐబీఓసీ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావు, బెఫీ నాయకులు సీహెచ్.శోభన్‌బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement