ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేస్తాం..
- వాటాలు 52%కి తగ్గించుకుంటాం: జైట్లీ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా వాటిలో వాటాలను 52 శాతానికి తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని, బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పిస్తామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) 68వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ప్రస్తుతం కేంద్రానికి ఎస్‌బీఐలో 59 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 76.5 శాతం, ఆంధ్రా బ్యాంకులో 61 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 59 శాతం, కెనరా బ్యాంకులో 64.5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 57.5 శాతం, అలహాబాద్ బ్యాంకులో 60 శాతం పైగా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 64.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 81.5 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, పీఎస్‌బీలు దేశ అభివృద్ధి అజెండాలో కీలక పాత్ర పోషించాలని, రాజకీయ జోక్యాలకు తావు లేకుండా వాటి నిర్వహణ పూర్తిగా బ్యాంకింగ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా సాగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే కొన్ని పీఎస్‌బీల్లో కీలక స్థానాల్లో ప్రొఫెషనల్స్ నియామకాలు జరిగాయని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో చేపట్టే నియామకాలన్నీ కూడా ప్రొఫెషనల్‌గా ఉండే విధంగా చూసేందుకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ బ్యూరోను ఏర్పాటు చేస్తున్న సంగతిని జైట్లీ ప్రస్తావించారు.
ఎకానమీ పటిష్టతకు మరిన్ని చర్యలు...
సంస్కరణలను కొనసాగించడం ద్వారా మన ఎకానమీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు జైట్లీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే ఇటు పరిశ్రమలపరంగానూ, అటు మార్కెట్లపరంగానూ అద్భుతమైన అవకాశాలు అందిరాగలవని పేర్కొన్నారు. 2015-16లో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయడంతో పాటు ఇంకా మెరుగైన వృద్ధి రేటు సాధించగలమని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ని కంప్యూటరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.