బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..! | Banking revival and private sector investment top Jaitley's priority list | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..!

Published Tue, Jun 6 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..!

బ్యాంకింగ్‌లో విలీనాల జోరు..!

ఇక జాప్యానికి తావులేదు
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా వేచి చూడనక్కర్లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ


న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఎదురుచూస్తూ కూర్చోకుండా.. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం మిగతా బ్యాంకులను కలిపే విషయానికి సంబంధించి ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా ఆగాలని అంతర్గతంగా భావించినట్లు ఆయన తెలిపారు. ‘అయితే, బ్యాంకింగ్‌ వ్యవస్థ తీరుతెన్నులను పునఃసమీక్షించిన మీదట ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కన్సాలిడేషన్‌కి అనువైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని గుర్తించాం. కాబట్టి ఆ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిపి 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ఉన్నాయి.

నిపుణుల అంచనాల ప్రకారం పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేయొచ్చు. అలాగే దక్షిణాదిలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ లాంటి టర్న్‌ఎరౌండ్‌ బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్లో కలపవచ్చు. ఇక దేనా బ్యాంక్‌ వంటి వాటిని దక్షిణాదిన మరో పెద్ద బ్యాంకులో కలిపేయవచ్చు. 2016–17 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో పీఎస్‌బీల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. కొన్ని పీఎస్‌బీలను మెరుగైన బ్యాంకులతో విలీనం చేస్తే మొండిబాకీల సమస్య పరిష్కారానికీ తోడ్పాటు లభిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వ్యాఖ్యానించడం తెలిసిందే.

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు రియల్టీ చిక్కు..
ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై స్పందిస్తూ.. సంస్థ రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఆయన చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో గణనీయంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ నికర నష్టం రూ. 5,158 కోట్లకు, మొండిబాకీలు 21.25 శాతానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ తరహాలోనే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే అవకాశం ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. మరోవైపు, యాక్సిస్‌ బ్యాంక్‌లో వాటాల విక్రయానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నామని జైట్లీ చెప్పారు. అయితే, ఇంతవరకూ దీనిపై ఏ సంస్థతోను చర్చలు జరపలేదని తెలిపారు. యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలీన వార్తలు వచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ ది యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌లో కేంద్రానికి 12.02% వాటాలు ఉన్నాయి.

వడ్డీ రేట్ల తగ్గింపును కోరుకుంటున్నా...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కీలకమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) ముందు రేట్ల తగ్గింపునకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం, అదే సమయంలో పెట్టుబడులు, వృద్ధి రేటు పుంజుకోవాల్సిన అవసరాన్ని జైట్లీ పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన ఎంపీసీ మంగళ, బుధవారాల్లో సమావేశమై ద్రవ్యపరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ ఆర్‌బీఐ మాత్రం ధరలపై జీఎస్‌టీ ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో యథాతథ స్థితినే కొనసాగించొచ్చని చెబతున్నారు. ‘‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా నియంత్రణలోనే ఉంది.

మంచి వర్షాలతో ఇది ఇకపైనా ఇదే విధంగా కొనసాగవచ్చు. అలాగే, చమురు ధరలు కూడా పెరగకపోవచ్చు. ఇదే సమయంలో వృద్ధి, పెట్టుబడులు మెరుగుపడాల్సి ఉంది. ఏ ఆర్థిక మంత్రి అయినా ఈ పరిస్థితుల్లో రేట్ల కోతనే కోరుకుంటారు. ప్రైవేటు రంగం సైతం రేట్ల కోతను ఆశిస్తుంది. ఈ అధికారం ఎంపీసీకి అప్పగించినందున నిర్ణయం కోసం వేచి చూస్తా’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో అరుణ్‌ జైట్లీ వివరించారు.

జీఎస్‌టీ తర్వాతే...!
గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ రేటు 7.1 శాతానికి తగ్గిన నేపథ్యంలో, పుంజుకునేందుకు గాను రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రేట్ల కోతకు అన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ... జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్‌టీ ఇందుకు ప్రతికూలంగా మారింది. జీఎస్‌టీ విధానం ధరలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ఆర్‌బీఐ స్పష్టత కోసం వేచి చూసే ధోరణి అవలంభించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తుందని తాను భావించడం లేదని, రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు చూసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని యూనియన్‌ బ్యాంకు ఈడీ వినోద్‌ కతూరియా పేర్కొన్నారు. జీఎస్‌టీ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.

ఎయిరిండియాను15 ఏళ్ల క్రితమే వదిలేయాల్సింది..
రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం 15 ఏళ్ల క్రితమే ప్రైవేటీకరించాల్సిందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సమర్ధవంతంగా నడుస్తుండటంతో దేశీయంగా పౌర విమానయాన రంగం మెరుగుపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో  దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాను ప్రజాధనంతో నిలబెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకూ సబబు అని పేర్కొన్నారు. కేవలం 14 శాతం మార్కెట్‌ వాటా కోసం దాదాపు రూ. 55,000–రూ. 60,000 కోట్ల ప్రజాధనాన్ని ధారపోయడం సరికాదన్నారు.  ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న నీతి ఆయోగ్‌ అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని, అయితే తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement