ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్‌బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు...
నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్...
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్‌పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్‌ఎంఈ రుణాలు ఎన్‌పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి.
రూ. 5,769 కోట్ల రికవరీలు...
మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్‌గ్రేడ్‌లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది.
రూ.7,000 కోట్ల సమీకరణ....
అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్‌లో ఎస్‌బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు.
రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్‌బీఐ
షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది.
రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను....
వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ లాభాలు సాధించామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు.
ఎస్‌బీఐ లాభం 2,312 కోట్లు
Published Sat, Aug 3 2019 5:04 AM | Last Updated on Sat, Aug 3 2019 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment