త్వరలో ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.10 వేల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకూ తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే కొద్ది వారాల్లో కేంద్రం ఈ నిధులు సమకూర్చుతుందని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఫలితాల అనంతరం, మొండిబకాయిలు, అవసరాలకు అనుగుణంగా ప్రతి బ్యాంకూ తనకు కావల్సిన తాజా మూలధనం వివరాలను ప్రభుత్వానికి సమర్పించాయని, దీనికి అనుగుణంగా నిధులు సమకూర్చే విషయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక కార్యాచరణ రూపొందించిందనీ అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల తాజా మూలధన కల్పనను బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పునర్వ్యస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు అందించనున్నారు. ఈ కార్యక్రమం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్లు ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25,000 కోట్లు ఇవ్వనున్నారు.