బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా
- 15 శాతం వేతనం పెంపు
- 2012 నవంబర్ నుంచి వర్తింపు
- ఇక నెలలో 2వ,4వ శనివారాలు సెలవు
- సంఘాల సమ్మె ప్రతిపాదన విరమణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకున్నారు. దీని ప్రకారం 2012 నవంబర్ నుంచీ 15 శాతం వేతన పెంపు అమలు కానుంది.
దీనితోపాటు నెలలో రెండు శనివారాలుత సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగ యూనియన్లకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీనితో తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25 నుంచీ నాలుగురోజుల పాటు జరపతలపెట్టిన సమ్మెను యూనియన్లు విరమించాయి. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ సోమవారమిక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. నెలలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్నది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండని, ఈ విషయంలో కూడా సానుకూల ఫలితం రావడం హర్షణీయమని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
మధ్యేమార్గం...
నిజానికి 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తొలుత 12.5 శాతం పెంపునకు సరే అంది. దీనికి యూనియన్లు ససేమిరా అన్నాయి. చివరకు చర్చల్లో మధ్యేమార్గంగా 15 శాతంగా నిర్ణయించుకున్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య, ఐబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 50,000 బ్రాంచీలుండగా, వాటిలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.