బ్యాంకుల విలీనం విరమించుకోవాలి
Published Sat, Jul 30 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
సీతమ్మధార: బ్యాంకుల విలీనం ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని బ్యాంకు యూనియన్ల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎ.ఎస్. ప్రభాకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకు వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్యాంకుల బంద్‌లో భాగంగా సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంక్ ఆవరణలో శుక్రవారం ధర్నా చేపట్టారు. నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలబాటలో ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకుల ప్రారంభానికి అనుమతులు ఇచ్చేస్తున్నారని ఆందోళన వ్యత్తం చేశారు. రూ.లక్షల కోట్లు బకాయి ఉన్న వారి పేర్లు మీడియా ద్వారా బయటపెట్టి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించరాదని కోరారు. సహకార బ్యాంకులను పటిష్టం చేయాలని, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాటి అనుబంధ బ్యాంకులలో విలీనం చేయాలని, వ్యవసాయ రంగానికి మరిన్ని రుణాలు ఇవ్వాలని కోరారు. పటిష్టమైన భారత్ కోసం పటిష్టమైన బ్యాంకింగ్ రంగాన్ని నిర్మించాలని పలువురు వక్తలు కోరారు. ధర్నాలో ఏఐఎస్‌ఈఏ నాయకుడు పీఎస్ మల్లేశ్వరరావు, యుఎఫ్‌బీయూ నాయకులు ఎన్.సాంబశివరావు, జె. కేశవరావు, జి. వాసుదేవరావు, బి.రమణమూర్తి, శంకరాజు, ఎ. యుగంధర్, ఎ.సుష్మ, పి.సరోజ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల బంద్ కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు.
Advertisement