సాక్షి,ముంబై: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముంబైలో జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో సంబంధిత తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. (అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన)
ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్స్‌తో బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. (అదానీ సెగ: ఎల్‌ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి)
ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment