
29% పెరిగిన ఆంధ్రాబ్యాంకు లాభం
6.21 నుంచి 8.09 శాతానికి చేరిన ఎన్‌పీఏలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు జూన్ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికరలాభం 29 శాతం అధికమై రూ.40 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.4,855 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం 13.55 శాతం పెరిగి రూ.1,441 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 5.61 శాతం వృద్ధితో రూ.1,88,272 కోట్లకు, మొత్తం అడ్వాన్సులు 6.25 శాతం పెరిగి రూ.1,45,801 కోట్లకు చేరుకున్నాయి.
కార్పొరేట్, మిడ్ కార్పొరేట్ అడ్వాన్సులు 6.90 శాతం తగ్గి రూ.59,918 కోట్లు నమోదు చేసింది. ఎంఎస్‌ఎంఈకి ఇచ్చిన అడ్వాన్సులు ఏకంగా 23.2 శాతం హెచ్చి రూ.28,637 కోట్లుగా నమోదయ్యాయి. గృహ రుణాలు 25.5 శాతం అధికమయ్యాయి. సూక్ష్మ తరహా కంపెనీలకు పెద్ద పీట వేస్తూ రూ.10,527 కోట్ల రుణాలను మంజూరు చేసింది. క్రితం ఏడాది జూన్ క్వార్టరుతో పోలిస్తే ఇది 55.11 శాతం అధికం.
నికర ఎన్‌పీఏలు 6.21 నుంచి 8.09 శాతానికి చేరాయి. రాని బాకీల కోసం చేసిన కేటాయింపులు గతేడాది జూన్ త్రైమాసికంలో రూ.942 కోట్లు ఉండగా, 2017–18 క్యూ1లో ఇవి రూ.1,209 కోట్లకు చేరడం గమనార్హం. లార్జ్, మిడ్ కార్పొరేట్ల ఎన్‌పీఏలు అధికమయ్యాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సుల్లో 24.38 శాతం నిరర్ధక ఆస్తులుగా మారాయి.