
నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యం...
ఇక నికర ఎన్‌పీఏలు మార్చిలో 2.2 శాతం ఉండగా... సెప్టెంబర్‌నాటికి 2.5 శాతానికి ఎగబాకాయని తెలిపింది.
అప్పుడే ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది...
వచ్చే ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండొచ్చు...
2016 మార్చి నాటికి మొండిబకాయిలు 4%కి తగ్గొచ్చు
ఆర్థిక స్థిరత్వ నివేదికలోరిజర్వ్ బ్యాంక్ అభిప్రాయం...
ముంబై: ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే.. ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ఒక్కటే మార్గమని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, వృద్ధి రేటు అంచనాలు పెరగడం, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి పరిణామాలతో దేశీ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి అడ్డుకట్టపడిందని తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్)లో ఈ అంశాలను ప్రస్తావించింది.
2015లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దరిదాపుల్లో స్థిరపడొచ్చని అంచనా వేసింది. వడ్డీరేట్లపై పాలసీ నిర్ణయానికి ప్రధాన కొలమానంగా ఆర్‌బీఐ పరిగణిస్తున్న రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది నవంబర్‌లో 4.4%కి దిగిరావడం తెలిసిందే. కాగా, ఈ ఏడాది(2014-15)లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మందగించడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.
మొండిబకాయిలపై ఆందోళన...
బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల(ఎన్‌పీఏ) పెరుగుదలపైనా ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఎఫ్‌ఎస్‌ఆర్ నివేదిక(2014 జూన్‌లో) నాటితో పోలిస్తే ఈ రంగంలో రిస్క్‌లు యథాతథంగానే ఉన్నాయని.. అంటే ఈ ఎన్‌పీఏల సమస్యకు చెక్ చెప్పాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోందని స్పష్టం చేసింది. గడచిన ఆరు నెలల్లో బ్యాంకుల స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) 0.4 శాతం మేర ఎగబాకాయని... సెప్టెంబర్ చివరికి మొత్తం రుణాల్లో 4.5 శాతానికి చేరినట్లు ఆర్‌బీఐ వివరించింది.
ఇక నికర ఎన్‌పీఏలు మార్చిలో 2.2 శాతం ఉండగా... సెప్టెంబర్‌నాటికి 2.5 శాతానికి ఎగబాకాయని తెలిపింది. అయితే, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో 2016 మార్చి నాటికి ఈ పరిమాణం 4 శాతానికి మెరుగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రుణాల పునర్ వ్యవస్థీకరణలు ఎగబాకడం మాత్రం తీవ్ర ఆందోళనకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. జీఎన్‌పీఏలు, రుణ పునర్‌వ్యవస్థీకరణలతో కలిపితే మొత్తం మొండి బకాయిల పరిమాణం ఈ ఏడాది మార్చిలో 10 శాతం కాగా.. సెప్టెంబర్ చివరికి 10.7 శాతానికి పెరిగాయని నివేదిక వెల్లడించింది.
‘బ్యాంకుల మధ్య అంతర్గత లింకుల కారణంగా కూడా మొండిబకాయిల రిస్క్‌లను పెంచుతోంది. ఒక బ్యాంకుకు సమస్య తలెత్తితే ఆ రిస్క్ ప్రభావం దానితో లింకున్న ఇతర బ్యాంకులపైనా పడేందుకు దారితీస్తోంది. దీన్ని కూడా నిశితంగా పర్యవేక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి’ అని ఆర్‌బీఐ నివేదిక తేల్చిచెప్పింది.
ప్రమోటర్ల షేర్ల తనఖాపై కన్ను...
మొండిబకాయిల పెరుగుదల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా వివిధ మార్గాల్లో షేర్ల తనఖాల ద్వారా ప్రమోటర్లు చేపడుతున్న నిధుల సమీకరణను నిశితంగా తనిఖీ చేయాలని సూచించింది. ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టి ఎడాపెడా నిధులను సమీకరించడం వల్ల వాటాదారుల్లో భయాలు నెలకొనడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఆందోళనకు దారితీస్తుందని పేర్కొంది.
మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా ముఖ్యమని కూడా నివేదిక అభిప్రాయపడింది. మరోపక్క, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) ఇటీవలి కాలంలో దేశీ డెట్(బాండ్‌లు) మార్కెట్లో ఎడాపెడా పెట్టుబడి పెట్టడంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఇతరత్రా పరిస్థితులు మారిపోతే ఈ నిధులు ఒక్కసారిగా వెనక్కివెళ్లే ప్రమాదం ఉందని.. దీనివల్ల దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రతికూలా ప్రభావానికి దారితీస్తుందని హెచ్చరించింది.