బ్యాకింగ్ రంగంలో ఉజ్వల భవిత ఉందని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఏవీ రావు చెప్పారు.
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: బ్యాకింగ్ రంగంలో ఉజ్వల భవిత ఉందని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఏవీ రావు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధానంపై ‘సాక్షి’ దినపత్రిక ఆదిత్య కాంపిటీషన్స్ సంస్థతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సుకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది.
స్థానిక శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం ఈ అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏవీ రావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ పరీక్షలకు దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోటీ పడుతుండగా, వీరిలో సిన్సియర్‌గా శ్రమించేవారు 50 వేలమంది ఉన్నట్లు తెలిపారు. ఒకే శిక్షణతో వివిధ బ్యాంకులు నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు గ్రాండ్ టెస్ట్‌లతో మేధస్సు పెంచుకోవచ్చని చెప్పారు.
ఆప్టిట్యూడ్ టెస్ట్, న్యూమరికల్ టెస్ట్‌లో 8, 9, 10 తరగతుల గణితశాస్త్రం నుంచి ఎక్కువగా ప్రశ్నలుంటాయని తెలిపారు. ఆంగ్ల దినపత్రికలు చదవడం ద్వారా భావాలను వ్యక్తీకరించే తీరు, పదాల కూర్పుపై అవగాహన కలుగుతుందని చెప్పారు. నెలల తరబడి పడిన శ్రమను రాత పరీక్షతో పాటు, 15 నిముషాలు జరిగే ఇంటర్వ్యూ దశలో చక్కగా ప్రెజెంట్ చేయడం ద్వారా ఉద్యోగం సాధించవచ్చని సూచించారు.
దళారులను నమ్మొద్దు...
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ అధికారి సి.బాలస్వామి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు డిమాండ్ చేసే దళారులు నమ్మవద్దని సూచించారు. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించేందుకు అభ్యర్థి మేధస్సు పరిధి ఆ జిల్లాకు వరకూ ఉంటే సరిపోతుందన్నారు. అదే జాతీయ బ్యాంకులకు రాష్ట్ర, జాతీయస్థాయి అంశాలపై పట్టు ఉండాలని చెప్పారు. అంకితభావం లేకుండా వంద టెస్ట్‌లు రాసినా ప్రయోజనం ఉండదని తెలిపారు.
విద్యార్థుల ‘భవిత’ కే అధిక ప్రాధాన్యం..
సాక్షి గుంటూరు బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2008లో సాక్షి ప్రారంభమైన రోజు నుంచే విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. యువతకు మార్గదర్శనం చేస్తూ జాతీయస్థాయిలో ఉద్యోగాలు, విద్యావకాశాలను ‘భవిత’ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. కాలానుగుణంగా ఉపాధిని చూపే కోర్సులు, ఉద్యోగాలపై వివిధ సంస్థలతో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు రోజూ దినపత్రికలు చదవడం ద్వారా సాధారణ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు.
ప్రణాళికతో చదవాలి.: ఆదిత్య కాంపిటీషన్స్ డెరెక్టర్ కె.ప్రణయ్‌కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం గల వారు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం సారధ్యంలో సిన్సియర్‌గా శ్రమిస్తే విజయం తథ్యమన్నారు. ఒక్క శిక్షణతోనే ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌కు సన్నద్ధం కావచ్చని తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశలో ఒక్క మార్కు తేడాతో విజయావకాశం చేజారే ప్రమాదముందని తెలిపారు. అర్ధమేటిక్, రీజనింగ్‌లో సమయం ఆదా చేసుకుంటే విజయం సాధించినట్లేనన్నారు.
సంపూర్ణ సమాచారానికి ‘సాక్షి’ ఎడ్యుకేషన్ పోర్టల్
సబ్జెక్టు నిపుణులు ఆర్‌వీ రమణ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు విలువైన సమాచారాన్ని అందించడంలో ‘సాక్షి’ ఎడ్యుకేషన్ పోర్టల్ విశేష సహకారం అందిస్తోందని చెప్పారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్ విద్యార్థుల భవితను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగ పడుతోందని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆయన వివరించారు.