వాహన, గృహ రుణాలకు చౌక వడ్డీరేట్ల స్కీం?
పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు చౌకగా వాహన, గృహ రుణాలను అందించేందుకు అటు ఆర్‌బీఐ, ఇటు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు చౌకగా వాహన, గృహ రుణాలను అందించేందుకు అటు ఆర్‌బీఐ, ఇటు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్‌బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ విధమైన కొత్త స్కీమ్‌పై దృష్టిసారిస్తున్నాయి. వాహన, గృహ నిర్మాణ రంగాలకు తక్కువ వడ్డీరేట్లకు రుణాలందించే విధంగా బ్యాంకులకు చౌకగా నిధులను అందించడమే ఈ స్కీమ్ ప్రధానోద్దేశం. గతేడాది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) ప్రవేశపెట్టిన ఇటువంటి తరహా పథకాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
ముఖ్యంగా బ్యాంకులు, బిల్డింగ్ సొసైటీలకు చౌక రేట్లకు నిధులను అందించేలా బీఓఈ ఈ ‘ఫండింగ్ ఫర్ లెండింగ్ స్కీమ్’ను రూపొందించింది. దీని ప్రకారం రుణ వితరణకు బూస్ట్ ఇచ్చేందుకు బీఓఈ కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. రుణాల జారీ పనితీరు ఆధారంగా ఏ రేటుకు, ఎంత మొత్తం నిధులను అందించాలనేది నిర్ణయిస్తారు. సరిగ్గా ఇలాంటి స్కీమ్‌ను ఆచరణలోపెట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మందగమనం, డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్, రియల్టీ రంగాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలుచేస్తే... రుణ గ్రహీతలకు వాహన, గృహ రుణాలపై తక్కువ రేట్లకు నిధులు చేతికందేందుకు, ఈ రంగాలకు కాస్త చేయూతనిచ్చేందుకు దోహదం చేస్తుంది.
రాజన్‌కు తొలి ‘పరీక్ష’ కఠినమే...
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్... ఈ నెల 20న(శుక్రవారం) జరపనున్న తొలి పరపతి విధాన సమీక్షలోనే కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా నిత్యావసరాల ధరల మంటతో టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో ఆరు నెలల గరిష్టానికి(6.1శాతం) ఎగబాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా వృద్ధిబాటలోకి వచ్చి జూలైలో 2.6 శాతం(జూన్‌లో ఇది మైనస్ 2.8 శాతం క్షీణత)గా నమోదవడం, డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవలి ఆల్‌టైమ్ కనిష్టం(68.80) నుంచి 63 స్థాయికి కోలుకోవడం జరిగాయి. మరోపక్క, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది(2013-14) తొలి త్రైమాసికంలో మరింత కిందికి జారి 4.4 శాతానికి(నాలుగేళ్ల కనిష్టం) పడిపోయింది. ఇవన్నీ చూస్తే వడ్డీరేట్ల తగ్గింపునకు దాదాపు అవకాశాలు లేవనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. పాలసీ నేపథ్యంలో ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో రాజన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖతో ఆర్‌బీఐ తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందనీ, తాజా భేటీ కూడా అలాంటిదేనంటూ రాజన్ వెల్లడించారు కూడా.
సర్వత్రా ఉత్కంఠ: రూపాయి పతనం, అధిక కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు శ్రుతిమించడంతో ఆర్‌బీఐ కఠిన పాలసీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వడ్డీరేట్లను తగ్గించాలంటూ కార్పొరేట్లు ఎన్ని డిమాండ్‌లు చేసినా, ప్రభుత్వం తగ్గించమని పరోక్ష సూచనలు ఇచ్చినప్పటికీ... గత సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేట్లను అప్పటి గవర్నర్ దువ్వూరి సుబ్బారావు యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే. దీంతో రెపోరేటు(బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించాల్సిన వడ్డీరేటు) 7.25 శాతంగా, సీఆర్‌ఆర్(బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల నిష్పత్తి) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో పాలసీ సడలింపు రాజన్‌కు కత్తిమీదసామే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో రాజన్ తొలి పరీక్షలో ఎలా నెగ్గుకొస్తారనే ఉత్కంఠ అటు బ్యాంకింగ్ ఇటు కార్పొరేట్ వర్గాల్లో నెలకొంది.
వృద్ధికి ఊతమివ్వాల్సిందే: కార్పొరేట్లు
పెట్టుబడుల పెంపు, తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు దోహదం చేసేలా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తొలి పాలసీ ప్రకటన ఉండాలని కోరుకుంటున్నట్లు కార్పొరేట్లు పేర్కొంటున్నారు. తద్వారా వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్‌ను మరోసారి లేవనెత్తారు. రుణాలు చౌకగా లభ్యమయ్యేందుకు వీలయ్యే కొన్ని విభిన్నమైన పరిష్కార మార్గాలను ఆర్‌బీఐ నుంచి ఎదురుచూస్తున్నామని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌ర్లలో విశ్వాసాన్ని నింపాలంటే అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలను పక్కనబెట్టి వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.