సెన్సెక్స్ 380 పాయింట్లు హైజంప్ | Sensex down 380 points in the high jump events | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 380 పాయింట్లు హైజంప్

Published Sat, Jan 3 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

సెన్సెక్స్ 380 పాయింట్లు హైజంప్

సెన్సెక్స్ 380 పాయింట్లు హైజంప్

నాలుగు వారాల గరిష్టం...
నిఫ్టీ లాభం 111 పాయింట్లు  

 
మార్కెట్  అప్‌డేట్

ముంబై: సెలవుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పనిచేయకపోవడంతో గత ఐదు రోజులుగా స్తబ్దుగా ఉన్న భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం పరుగులు పెట్టాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చోటు చేసుకుంటాయన్న అంచనాలు, గత ఏడాది డిసెంబర్ తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండటంతో మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాల్లోనే సాగాయి. 27,937-27,521 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు  380 పాయింట్లు లాభపడి 27,888 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్ల నిఫ్టీ 8,400 స్థాయిని దాటేసింది.చివరకు 111 పాయింట్ల లాభంతో 8,395 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదు సెషన్లలో 299 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఒక్క శుక్రవారం రోజే 380 పాయింట్లు ఎగసింది. నాలుగు వారాల గరిష్టానికి చేరింది. బ్యాంక్ షేర్లతో పాటు క్యాపిటల్ గూడ్స్, ఐటీ, విద్యుత్తు, టెక్నాలజీ, మౌలికరంగం, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం గురువారం పెంచింది.

ఈ పెంపు వల్ల సమకూరిన మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 15,000 కిమీ, రహదారులను నిర్మించడానికి వినియోగిస్తామని పేర్కొంది. దీంతో సిమెంట్, నిర్మాణ రంగ షేర్లు పెరిగాయి. 3జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన వివరాలను మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనున్నదన్న వార్తలతో టెలికం షేర్లు జోరందుకున్నాయి.  కాగా, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.  చైనా, జపాన్, తైవాన్ స్టాక్ మార్కెట్లు సెలవు కావడంతో పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు నష్టాల్లోముగిశాయి. అమెరికా మార్కెట్లు తుది సమాచారం అంతే సరికి నష్టాల్లో ఉన్నాయి.
 

 
 
 
 ఈ ఏడాదీ బుల్న్ ్ర
 
 అసోచామ్ నివేదిక
 
 
 
 న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది కూడా జోరుగానే పెరుగుతాయని అసోచామ్ తాజా నివేదిక వెల్లడించింది. కంపెనీల పనితీరు మెరుగుపడడం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండడం, వీటికి తోడు సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ పోకడలు... వీటన్నింటి ఫలితంగా ఈ ఏడాది కూడా బుల్న్ ్రకొనసాగుతుందని పేర్కొంది. 2015 భారత క్యాపిటల్ మార్కెట్ అంచనాలు పేరుతో ఈ నివేదికను అసోచామ్ రూపొందించింది. అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పడుతుండడం భారత స్టాక్ మార్కెట్లకు కలసివస్తుందని ఈ నివేదిక పేర్కొంది. 2014 తరహాలోనే ఈ ఏడాది మరింత స్థిరత్వంతో స్టాక్ మార్కెట్లు రాణిస్తాయని పేర్కొంది. సెకండరీ మార్కెట్ వృద్ధి మంచిగా ఉండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్స్ సానుకూలంగా ఉండటంతో ఐపీఓ మార్కెట్ కూడా మంచిగానే ఉండనున్నదని పేర్కొంది. గత ఏడాది బీఎస్‌ఈ స్మాల్-క్యాప్ ఇండెక్స్ 70 శాతం, మిడ్-క్యాప్ ఇండెక్స్ 50 శాతానికి పైగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 35 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. గత ఏడాది పబ్లిక్ ఈక్విటీ మార్కెట్ రూ.39,127 కోట్లు సమీకరించిందని ఈ నివేదిక వివరించింది.
 
 ఎన్‌సీఎంఎల్ ఐపీవో గడువు పెంపు
 ముంబై: వంటనూనెల వ్యాపార సంస్థ ఎన్‌సీఎంఎల్ ఇండస్ట్రీస్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ గడువును జనవరి 9 దాకా పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ధర శ్రేణిని కూడా రూ. 100-120 నుంచి రూ. 80-90కి తగ్గిస్తున్నట్లు బీఎస్‌ఈకి తెలిపింది. మార్కెట్ వర్గాల నుంచి ఐపీవోకి ఆశించిన స్పందన రాకపోవడమే ఇందుకు కారణం. 60 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయానికి సంబంధించి ఐపీవో డిసెంబర్ 29న ప్రారంభమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement