సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగంలో నియామాకాలు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ రంగంలో 21 శాతం వృద్ధి రేటు నమోదైందని జాబ్ పోర్టల్ నౌకరి.కామ్ రిపోర్టు చేసింది. దేశంలో ఉద్యోగ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నెలలో మొత్తం ఉద్యోగ మార్కెట్ 3 శాతం వృద్ధిని నమోదుచేసిందని పేర్కొంది. ఈ వృద్ధి కూడా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆటో, ఇంజనీరింగ్ వంటి రంగాల వల్ల సాధ్యమైందని నౌకరి.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ.సురేష్ పేర్కొన్నారు.
వచ్చే కొన్ని నెలల వరకు ఉద్యోగ మార్కెట్‌లో ఈ అస్థిరత కొనసాగుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో నియామకాలు 15 శాతం వృద్ధిని నమోదుచేశాయని చెప్పారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగాలు 32 శాతం, ఫైనాన్స్ ఉద్యోగాలు 15 శాతం వృద్ధి కనబర్చాయని నౌకరి.కామ్ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ రంగంలో నియామకాలు మాత్రం ఆరు శాతం పడిపోయినట్టు తెలిసింది. మొత్తం 13 నగరాల్లో చేపట్టిన ఈ రిపోర్టులో 12 నగరాల్లో నియామకాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ముంబై, కోల్‌కత్తాలో 15 శాతం వృద్ధి నమోదైంది. దేశరాజధానిలో మాత్రం నియామకాలు 9 శాతం తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment