అందుకే.. ఆ 2 రంగాల్లో పరిమితులు మార్చలేదు
న్యూఢిల్లీ: కీలకమైన రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో సిసలైన ఇన్వెస్టర్లే పెట్టుబడులు పెట్టాలన్నది తమ అభిమతమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాత్రికి రాత్రి అమ్ముకుని బిచాణా ఎత్తేసే తరహా ఇన్వెస్టర్ల రాకను ప్రభుత్వం కోరుకోవడం లేదని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఇప్పటిదాకా ఉన్నట్లుగానే యథాతథంగా ఉంచినట్లు మంత్రి వివరించారు. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితుల్లో కేంద్రం మార్పులు చేసిన నేపథ్యంలో ఆమె వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఎన్నారై మార్గాల్లో వచ్చే వాటన్నింటికీ ఉమ్మడి పరిమితులను వర్తింపచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షం సహకారం లభించగలదని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.