
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం కావడం.... మన దేశపు బ్యాంక్‌లపై ఈ ఏడాది తీవ్రమైన ప్రభావమే చూపనున్నది. మొండి బకాయిలు 2 శాతం, వడ్డీ వ్యయాలు 1.3 శాతం మేర పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందని, మరింత కాలమే ఈ వైరస్ కల్లోలం కొనసాగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయని ఈ సంస్థకు చెందిన క్రెడిట్ ఎనలిస్ట్ గావిన్ గన్నింగ్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
► ఈ ఏడాది ఆర్థిక రంగ కష్టాలు అంచనాలను మించి ఉంటాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఆర్థిక స్థితిగతులు మరింత అస్తవ్యస్తమవుతాయి. ఇది బ్యాంక్ రుణాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతుంది.
► ప్రపంచ వ్యాప్తంగా బ్యాంక్‌ల వడ్డీ వ్యయాలు అదనంగా 30,000 కోట్ల డాలర్లు, మొండి బకాయిలు 60,000 కోట్ల డాలర్ల మేర పెరుగుతాయి.
► కరోనా కల్లోలం కారణంగా మొదటి దశలో కార్పొరేట్ రంగమే అధికంగా కుదేలైంది. బ్యాంకింగ్ రంగానికి సెగ పెద్దగా తగల్లేదు. ఈ వైరస్ ఉధృతి నానాటికీ తీవ్రమవుతుండటంతో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం తీవ్రంగానే ఉండనున్నది.
► ఈ ఏడాది చైనా బ్యాంక్‌ల మొండి బకాయిలు కూడా 2 శాతం మేర పెరుగుతాయి. వడ్డీ వ్యయాలు మాత్రం 1 శాతం మేర మాత్రమే పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment