ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు | Aadhaar ATM services like this | Sakshi
Sakshi News home page

తపాలా సేవలు పిలిస్తే పైసలు...

Published Thu, Nov 7 2019 3:26 AM | Last Updated on Thu, Nov 7 2019 8:39 AM

Aadhaar ATM services like this - Sakshi

వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్‌ పాస్‌బుక్, విత్‌ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్‌ లేదా ల్యాండ్‌లైన్‌ ద్వారా పోస్టల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 155299కు ఫోన్‌ చేసి రిక్వెస్ట్‌ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్‌మేన్‌ ‘మొబైల్‌ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే..

సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్‌ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌’ పేరుతో బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్‌ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్‌ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్‌ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్‌ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ‘ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌’ ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా నగదు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్‌ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది.

మొబైల్‌ మైక్రో ఏటీఎంలు
తపాలా శాఖ హైదరాబాద్‌ నగర పరిధిలోని 950 మంది పోస్ట్‌మేన్‌లకు ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్‌ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి మొబైల్‌ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్‌ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు.

ఆధార్‌ ఏటీఎం సేవలు ఇలా..
155299 నంబర్‌కు రిక్వెస్ట్‌ పంపగానే, ఆ ఏరియా పోస్ట్‌మేన్‌ ‘మొబైల్‌ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు.
 పోస్ట్‌మేన్‌ మీ పేరు, మొబైల్‌ నంబరు తీసుకుని ఎంటర్‌ చేయగానే, మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయగానే ఆధార్‌ నంబర్‌ అడుగుతుంది. 
​​​​​​​- అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్‌ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్‌ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్‌ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్‌తో ఆ బ్యాంక్‌ ఖాతా అనుసంధానమై ఉండాలి). 
​​​​​​​- ఆపై బయోమెట్రిక్‌ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్‌ డ్రా, మినీ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్‌ విచారణ, ఫుల్‌ మనీ ఆప్షన్లు వస్తాయి.
​​​​​​​- ఉదాహరణకు నగదు విత్‌ డ్రా ఆప్షన్‌ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్‌ అందించాలి. 
​​​​​​​- ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్‌మేన్‌ ఆ నగదు అందజేస్తారు. 

ఏరియా పోస్ట్‌మేన్‌లను అడిగితే చెబుతారు
ఏరియా పోస్ట్‌మేన్‌లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్‌ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్‌ చార్జీ ఉండదు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్‌మేన్‌ అందుబాటులోకి వస్తారు.  
– జయరాజ్, చీఫ్‌ పోస్ట్‌మాస్టర్, జనరల్‌ పోస్టాఫీసు, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement