
ముంబై: కేంద్రం 2022–23 వార్షిక బడ్జెట్‌లో బ్యాంకులకు ఎటువంటి మూలధన కేటాయింపులూ జరిపే అవకాశం లేదని రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనా వేస్తోంది. దేశీయ బ్యాంకింగ్ సొంతంగా నిధులు సమీకరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే దీనికి కారణంగా తెలిపింది. గడచిన ఆరు సంవత్సరాల్లో కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 లక్షల కోట్ల మూలధనం సమకూర్చినట్లు కూడా తన నివేదికలో పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా వార్షిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టే సందర్భంగా బ్యాంకులకు మూలధనం కేటాయింపుల పరిమాణంపై పెద్ద చర్చ జరిగే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యలో విడుదలైన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- బ్యాంకింగ్‌కు సొంతంగా నిధులు సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ప్రాతిపదికన ఈ దఫా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరక్కపోతే, ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్గత వనరులు, మార్కెట్ వర్గాల ద్వారా నిధులను సమీకరించుకునే వీలుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరక్కపోతే గడచిన దశాబ్ద కాలంలో ఈ తరహా చర్య ఇదే తొలిసారి అవుతుంది.
- పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి బ్యాంకులకు గడచిన ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3.36 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు జరిపిన నేపథ్యంలో, ప్రభుత్వ బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం సెప్టెంబర్ 2021 నాటికి (రుణాల్లో) 2.8 శాతానికి తగ్గింది. మార్చి 2018లో ఈ పరిమాణం 8 శాతం కావడం గమనార్హం.
- ఎంతోకాలంగా పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులపై అధిక కేటాయింపులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆదాయాలు మెరుగుపడినట్లు కనబడుతోంది. ఈ కారణంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతో ఉన్నాయని, అంతర్గతంగా నిధులు సమీకరణ సత్తాను సముపార్జించుకున్నాయని భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
- ఎన్‌ఏఆర్‌సీఎల్(నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లేదా బ్యాడ్ బ్యాంక్) కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, దీర్ఘకాలంగా తెగని సమస్యగా ఉన్న ఎన్‌పీఏల నుంచి రికవరీలు చోటుచేసుకునే వీలుంది. ఇది బ్యాంకుల లాభాలను మున్ముందు సంవత్సరాల్లో మెరుగుపరచే అంశం.
- 2021–22 ఆర్థిక సంవత్సరం కాల్ ఆప్షన్ కోసం చెల్లించాల్సిన తమ అదనపు టైర్ 1 బాండ్‌లను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రోల్ ఓవర్ చేయగలిగాయి. ఇది బ్యాంకుల ఇష్యూల కోసం పెట్టుబడిదారుల బలమైన కోరికను ప్రతిబింబిస్తుంది. బ్యాంకుల భవిష్యత్ ఇష్యూలకు కూడా ఇది శుభ సూచిక. ఇది వారి భవిష్యత్ జారీలకు మంచి సూచన అని పేర్కొంది.
- బ్యాంకులు ఇటీవలి సంవత్సరాలలో చేసినట్లుగానే మున్ముందూ మార్కెట్ మార్గాల ద్వారా మూలధన సేకరణ జరిపే అవకాశం ఉంది. క్లీనర్ బ్యాలెన్స్ షీట్లు, మెరుగైన ఆదాయాలు ఇందుకు దోహదపడే అంశం.
- ఆర్‌బీఐ నుండి శాశ్వత రీఫైనాన్స్ విండో కోసం బడ్జెట్‌లో కొంత కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు– ఎన్‌బీఎఫ్‌సీలకు (మౌలిక రంగం యేతర) సమీప కాల నిధుల లభ్యత కోసం కొన్ని ద్రవ్య పరమైన, హామీతో కూడిన పథకాలు బడ్జెట్‌లో చోటుచేసుకునే వీలుంది. ఈ రంగానికి మధ్య కాలానికి మద్దతు లభించే చర్యలను ప్రకటించే వీలుంది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది, ఈ రంగం స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతుంది.
ఒమిక్రాన్ ఎఫెక్ట్
ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) 2022 సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరిస్తోంది. 2021 సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరుగుతోంది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది.
Comments
Please login to add a commentAdd a comment