
టెక్నాలజీ ఆధునికతను సంతరించుకుంటున్నా దేశ బ్యాంకింగ్ రంగంలో మాత్రం భారీ మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి. వీటికి పగ్గాలు వేసి, ఇకపై అవి జరగకుండా నిరోధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగులు సైతం మోసపూరిత శక్తులతో చేతులు కలుపుతుండటం ఈ రంగానికి పెద్ద సమస్యగా మారిపోయింది.
2012 – 2016 మధ్య మోసాల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.22,743 కోట్లు నష్టపోయినట్టు ఐఐఎం, బెంగళూరు అధ్యయనం చెబుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవలే పార్లమెంట్‌కు వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 21 నాటికి రూ.179 కోట్ల విలువైన 25,600 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి.
బడా స్కామ్‌లు...
♦ 2011లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఐడీబీఐ బ్యాంకుల్లో ఉద్యోగులు 10,000 ఖాతాలను కల్పితంగా సృష్టించారు. 150 కోట్ల విలువైన రుణాలను ఆయా ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న విషయం వెలుగు చూసింది. సీబీఐ ఈ మోసాన్ని వెలుగులోకి తీసింది.
♦ 2014లో ముంబై పోలీసులు కొందరు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులపై తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రూ.700 కోట్ల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్ల మోసానికి పాల్పడినట్టు అభియోగం.
♦ 2014లోనే ఎలక్ట్రోకెమ్ ఇండియా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాను రూ.436 కోట్ల మేర మోసం చేయగా, కోల్‌కతాకు చెందిన వ్యాపారి బిపిన్ వోహ్రా ఫోర్జింగ్ పత్రాలను ఇవ్వడం ద్వారా రూ.140 కోట్ల మేర రుణాలు తీసుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు టోకరా వేశారు.
♦ ఇదే ఏడాది లంచాలు తీసుకుని రూ.8,000 కోట్ల మేర రుణాలను ఇచ్చిన స్కామ్‌లో సిండికేట్ బ్యాంకు నాటి చైర్మన్, ఎండీ పాత్ర వెలుగులోకి వచ్చింది.
♦ 2015లో జైన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ ఉద్యోగులు రూ.212 కోట్ల విలువ మేర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మోసానికి పాల్పడ్డారు.
♦ ఇదే ఏడాది పలు బ్యాంకుల ఉద్యోగులు రూ.6,000 కోట్ల మేర ఫారీన్ ఎక్సేంజ్‌ను మోసగించారు.
♦ 2016లో 386 మంది నకిలీ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్‌ఐసీ పాలసీలతో సిండికేట్ బ్యాంకును రూ.1,000 కోట్ల మేర ముంచారు.
♦ 2017లో యునైటెడ్ బ్రేవరీస్ చైర్మన్ విజయ్‌మాల్యా, మరో పది మంది ఐడీబీఐ బ్యాంకుకు రూ.950 కోట్ల విలువైన రుణాలను చెల్లించనందుకు సీబీఐ చార్జ్‌షీటు సిద్ధం చేసింది.
♦ అలాగే, రూ. 1,161 కోట్ల ఉద్దేశపూర్వక నష్టానికి కారణమైనందుకు ఐదు ప్రభుత్వరంగ బ్యాంకులకు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు వ్యతిరేకంగా చార్జ్‌షీటు దాఖలు చేసింది.
♦ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త నీలేష్ పరేఖ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 20 బ్యాంకులకు నీలేష్ రూ.2,223 కోట్ల మేర నష్టం కలిగించారు.
♦ రెండు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.290 కోట్ల మేర మోసం చేసిన కేసులో అభిజీత్ గ్రూపు ప్రమోటర్లు, కెనరా బ్యాంకు మాజీ డీజీఎంను సీబీఐ 2017లో అరెస్ట్ చేసింది.
♦ రూ.836 కోట్ల మోసం కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ జోనల్ హెడ్‌తోపాటు సూరత్‌కు చెందిన ప్రైవేటు లాజిస్టిక్స్ కంపెనీ డైరెక్టర్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది.
♦ 2018లో రూ.500 కోట్ల మోసం కేసులో ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇందులో గుజరాత్‌కు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ పాత్ర కూడా ఉంది.